మహర్షుల శాపం వృథాపోతుందా ?

దత్తాత్రేయస్వామి అనుగ్రహంతో వెయ్యి చేతులను పొందిన కార్తవీర్యార్జునుడులో అహంభావం చోటు చేసుకుంటుంది. ఆయన మాట తీరులో ... ప్రవర్తనలో తనని ఎవరూ ఏమీ చేయలేరనే గర్వం స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరికి అగ్నిదేవుడు వస్తాడు. ఆకలి బాధను తట్టుకోలేకపోతున్నాననీ, ఆయన రాజ్య పరిధిలో గల అడవులను దహించడానికి అనుమతిని ఇవ్వమని కోరతాడు.

అందుకు అంగీకరించిన కార్తవీర్యుడు, ఈ విషయంలో అగ్నిదేవుడికి ఎవరూ ఆటంకం కలిగించకుండా చూస్తానని హామీ ఇస్తాడు. అగ్నిదేవుడు అడవులను దహిస్తూ వుండగా, ఆయనకి ఎలాంటి ఆటంకం కలగకుండా కార్తవీర్యుడు పర్యవేక్షిస్తూ వుంటాడు. మంటలు అడవులను దహిస్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం దిశగా పరుగులు తీస్తుంటాయి.

ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన మహర్షి, తన ఆశ్రమం దిశగా వస్తోన్న మంటలను చూస్తాడు. ఆకాశ మార్గాన వుండి ఈ చోద్యం చూస్తోన్న కార్తవీర్యుడిని గమనిస్తాడు. అడవిలోని జంతువులు ... పక్షులతోపాటు తన ఆశ్రమం కూడా మంటలపాలు కాబోతుండటంతో మహర్షి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన కార్తవీర్యుడు, ఓ మహర్షి కుమారుడి చేతిలో సంహరించబడతాడని శపిస్తాడు.

అయితే తన శౌర్య పరాక్రమలపై నమ్మకమున్న కార్తవీర్యుడు, ఓ మహర్షి కుమారుడు తనని సంహరించడం జరగని పని అనుకుంటాడు. ఆ తరువాత కామధేనువు విషయంలో జమదగ్ని మహర్షిని కార్తవీర్యుడు హతమారుస్తాడు. తన తండ్రి ప్రాణాలు తీసిన కార్తవీర్యుడిని పరశురాముడు సంహరించడం జరుగుతుంది. దాంతో మహర్షుల శాపం వృథా కాదనే సత్యం ఈ లోకానికి మరోమారు అనుభవంలోకి వచ్చింది.


More Bhakti News