ఆరోగ్యాన్నిచ్చే సంజీవరాయ పుష్కరిణి

సంపాదించిన ఆస్తిపాస్తులు స్థిరంగా ఉండాలన్నా ... ఆ సంపద ద్వారా సుఖ సంతోషాలు అనుభవించాలన్నా ఆరోగ్యంగా వుండటం ఎంతో అవసరం. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యమని అనుభవంతో చెప్పారు. కుటుంబంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో బాధపడుతున్నా, పరోక్షంగా ఆ బాధ అందరినీ పీడిస్తూనే వుంటుంది. గుళ్లకి ... గోపురాలకి తిప్పుతూనే వుంటుంది. ఇలా అనారోగ్యంతో బాధపడుతూ నివారణా మార్గాల కోసం అన్వేషిస్తోన్న వారికి 'సంజీవరాయ పుష్కరిణి' లోని నీరు ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది.

మహిమాన్వితమైన ఈ పుష్కరిణి చిత్తూరు జిల్లాలోని 'అరగొండ' లో దర్శనమిస్తుంది. అభయాంజనేయస్వామి ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో, సంజీవరాయ పుష్కరిణి కనిపిస్తుంది. పూర్వం రావణుడితో యుద్ధానికి దిగిన సమయంలో మేఘనాథుడితో పోరాడుతూ లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. ఆయనని తిరిగి ఈ లోకంలోకి తీసుకురావడానికి 'సంజీవిని' అనే ఔధం అవసరమని చెప్పడంతో, ఆ పర్వతాన్ని హనుమంతుడు పెకిలించుకువస్తాడు.

సంజీవనీ పర్వతాన్ని హనుమంతుడు తీసుకుని వెళుతుండగా అందులోని సగభాగం ఈ ప్రదేశంలో పడిపోయిందట. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'అరగొండ' (సగంకొండ) అనే పేరు వచ్చిందని అంటారు. ఇక ఈ అరగొండపై గల పుష్కరిణిలో స్నానం ఆచరించడం వలన ... ఈ నీటిని స్వీకరించడం వలన దీర్ఘకాలికంగా బాధిస్తోన్న మొండివ్యాధులు నయమవుతున్నట్టుగా స్థానికులు చెబుతుంటారు.

ఇక ఈ పుష్కరిణి నుంచి అప్పుడప్పుడు 'ఓంకారం' వినిపిస్తూ ఉంటుందనీ, పౌర్ణమి రోజుల్లో ఈ ధ్వని మరింత ఎక్కువ దూరం వినిపిస్తూ ఉంటుందని అంటారు. అందువలన ఈ పుష్కరిణి మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ కారణంగా ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.


More Bhakti News