స్వప్నాలు - సూచనలు

సాధారణంగా తల్లిదండ్రులు తమ కూతురుకి మంచి సంబంధం దొరకాలని కలలుకంటూ వుంటారు. ఇక కన్నెపిల్లలు తమకి మంచిభర్త లభించాలని కలలుకంటూ వుంటారు. అలాగే అబ్బాయిలు కూడా అందమైన అమ్మాయి భార్యగా రావాలని కలలుకంటూ వుంటారు. ఇలా కాలేజ్ సీట్ల నుంచి ఉద్యోగాల వరకూ ప్రతివారు తాము ఆశించినట్టుగా జరగాలని కలలుకంటూ వుంటారు. అయితే అందమైన కలలు కంటూ ఆనందంలో తేలిపోయే వారికి అప్పుడప్పుడు పీడకలలు వచ్చి భయపెడుతూనే ఉంటాయి.

నిత్య జీవితంలో కలలుకనని కళ్లు వుండవు ... ఆ కలలను నిజం చేసుకోవాలని ఆరాటపడని మనసూ వుండదు. అయితే కల ఏదైనా అది రావడానికి ఒక కారణముంటుందనీ, భవిష్యత్తులో జరగనున్న మంచి చెడులను అవి సూచిస్తుంటాయని శాస్త్రాలు ... గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి వాటిని ఒకసారి పరిశీలించి చూస్తే ... ఏయే కలలు ఎలాంటి శుభాలను ... ఎటువంటి ఆశుభాలను సూచిస్తాయనేది తెలుస్తుంది.

సూర్య చంద్రులను చూసినట్లు ... పసుపు కుంకుమలు ధరించినట్లు ... తనకి వివాహం జరిగినట్లు ... వేదాధ్యయనం చేసినట్లు ... దేవతలను కలుసుకున్నట్లు ... గంగా స్నానం చేసినట్లు ... గోవులను చూసినట్లు ... క్షీరపానం చేసినట్లు ... రక్తం చూసినట్లు ... నరమాంసం తిన్నట్లు ... గుర్రాలు - ఏనుగులు - రథాలు అధిరోహించినట్టు కలలు వస్తే, వాటిని శుభ శకునాలుగా భావించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కలలు భవిష్యత్తులో లభించనున్న ఆనందాన్ని ... అభివృద్ధిని ... సూచిస్తాయని అంటున్నాయి.

ఇక నువ్వులు ... నూనె ... ఆముదం చూసినట్లు ... మురుగునీటిలో మునిగినట్లు ... వెళుతున్న రైలులో నుంచి దూకినట్టు ... తుపాకీ దెబ్బ తగిలినట్లు ... సముద్రంలో వున్నట్లు, పాము ... పంది ... గాడిద ... పత్తి ... ఇనుము ... ఎముకలు చూసినట్లు ... క్షురకర్మ చేయించుకున్నట్లు కలలు వస్తే వాటిని చెడు శకునాలుగా భావించాలి. ఈ కలల కారణంగా వినరాని సమాచారాలు అందడం ... అనారోగ్యాలు సంభవించడం ... ఆపదల బారినపడటం జరుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇలా కీడుచేసే పీడకలలు వచ్చినప్పుడు, మనసులో ఇష్ట దైవాన్ని స్మరిస్తూ కాసేపు ధ్యానం చేయడం వలన వాటి తీవ్రత తగ్గడమే కాకుండా మనసుకు శాంతి లభిస్తుంది.


More Bhakti News