బలమైన సంకల్పానికి భగవంతుడిచ్చే వరం

దైవాన్ని దర్శించిన భక్తులు తమ కుటుంబ సభ్యులను చల్లగా చూడమని కోరుకుంటూ వుంటారు. ఆపదల నుంచి .. అనారోగ్యాల నుంచి .. ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి తమని కాపాడమంటూ ప్రార్ధిస్తూ వుంటారు. వాళ్ల భక్తి శ్రద్ధలను బట్టి ... నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగించే తీరును బట్టి ఆ దైవం వారి కోరికలను నెరవేర్చుతూ వుంటుంది.

ఇక మహాభక్తుల విషయానికి వస్తే భగవంతుడి దర్శనం మినహా తమకి ఏమీ అవసరం లేదన్నట్టుగా వాళ్ల ఆరాధన వుంటుంది. ఆ పరమాత్ముడిని ప్రత్యక్షంగా దర్శించాలనీ ... సేవించాలని వాళ్లు ఆరాటపడుతుంటారు. వాళ్ల బలమైన సంకల్పానికి కరిగిపోయిన భగవంతుడు, నేరుగా వాళ్ల ముందల దిగిపోతాడు. మహాభక్తుల కోరికలు లోక కల్యాణానికి సంబంధించివై వుంటాయి గనుక స్వామివారు వెంటనే వాటిని అనుగ్రహిస్తూ వుంటాడు.

అలాంటి మహిమాన్వితమైన సంఘటన జరిగిన ప్రదేశంగా ఆదిలాబాద్ సమీపంలో గల 'జైనాథ్' ఆలయం కనిపిస్తుంది. పూర్వం 'నారాయణ' అనే భక్తుడు నిరంతరం శ్రీమన్నారాయణుడిని గురించి జపం చేస్తూ ఉండేవాడట. సప్తరుషులు సరాసరి నారాయణ దగ్గరికి వచ్చి, ఆయన జపం దేనిని ఆశించి చేస్తున్నదీ తెలుసుకుంటారు. శ్రీమన్నారాయణుడి దర్శనం తప్ప తనకి మరో వరం అవసరంలేదని ఆయన చెప్పడంతో, ఆ స్వామిని త్వరగా మెప్పించే ఓ మంత్రాన్ని ఉపదేశించి వెళ్లిపోతారు.

ఆ మంత్రాన్ని అదే పనిగా స్మరిస్తూ ఉండటంతో స్వామి ప్రత్యక్షమవుతాడు. అసమానమైన ఆయన భక్తికి చిహ్నంగా తాను ఆ ప్రదేశంలో జయనాథుడు అనే పేరుతో ఆవిర్భవిస్తున్నాననీ, సూర్యుడు ఉన్నంత కాలం ఆ క్షేత్రం విలసిల్లుతూ ఉంటుందని వరాన్ని అనుగ్రహిస్తాడు. అందుకు నిదర్శనంగా ప్రతియేటా మార్చ్ .. ఏప్రిల్ .. సెప్టెంబర్ .. అక్టోబర్ మాసాల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతూ వుంటాయి. మహిమాన్వితమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు .. సూర్యకిరణాలు స్వామివారి పాదాలకి పట్టే నీరాజనాలను కళ్లకి అద్దుకుంటూ వుంటారు.


More Bhakti News