సంతోషాల నిచ్చే సద్గురు సాయి

గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తాడు. ఆ వెలుగులోనే నిజానిజాలు గుర్తించడం జరుగుతుంది .. భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది .. గమ్యాన్ని ఎంచుకుని దానిని చేరుకునే ప్రయత్నం జరుగుతుంది. భక్తుడికి ... దైవానికి మధ్య గురువు అనుసంధాన కర్తగా వ్యవహరిస్తాడు.

గురువు ద్వారా భగవంతుడిని దర్శించడం ... ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం తేలిక అవుతుంది. అలా అశేష భక్త జనకోటిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తోన్న సద్గురువు శ్రీ శిరిడీ సాయిబాబా. ఆయన చూపుతోన్న మహిమలు నేటికీ భక్తుల అనుభవాలుగా వెలుగు చూస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఆవిర్భవించిన సాయి ఆలయాల్లో ఒకటి సికింద్రాబాద్ - ఓల్డ్ బోయిన్ పల్లిలో దర్శనమిస్తుంది.

సాధారణంగా సాయి ఆలయాలు భక్తుల సహాయ సహకారాలతో నిర్మించబడుతూ వుంటాయి. అలాగే ఇక్కడి ఆలయం కూడా రూపుదిద్దుకుంది. విశాలమైన ఆలయంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై సాయి దర్శనమిస్తూ వుంటాడు. సాయి చల్లని చూపు ప్రశాంతతను ప్రసాదిస్తూ వుంటుంది ... సాయి చిరుమందహాసం చింతలను దూరం చేస్తూ వుంటుంది. ఈ ఆలయంలో అడుగుపెట్టడంతోనే అనారోగ్యాలు ...ఆవేదనలు మటుమాయమై పోతాయని భక్తులు చెబుతుంటారు.

ప్రతి రోజూ అభిషేకాలు ... అలంకారాలు ... నాలుగు హారతులు జరుగుతుంటాయి. ఇక గురువారం రోజున ... పర్వదినాల్లోనూ బాబాను దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఈ రోజున ప్రత్యేక పూజలు ... సేవలు జరుపుతుంటారు. బాబా అనుగ్రహంతో అనుకున్న కార్యాలను చక్కబెట్టిన వాళ్లు కృతజ్ఞతగా ఆయన సేవలకు అవసరమైన సహకారాలను అందిస్తూ వుంటారు ... సంతోషాలను అందించే సాయికి సాష్టాంగ నమస్కారాలను చేస్తుంటారు.


More Bhakti News