కాళహస్తిలో కంచి దేవుడు

దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 'శ్రీ కాళహస్తి' ఒకటి. పూర్వం సాలెపురుగు ... పాము ... ఏనుగు మహాదేవుడి పట్ల తమ అసమానమైన భక్తి శ్రద్ధలను చాటుకుని మోక్షాన్ని పొందిన కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. ఆదిదేవుడు ఈ క్షేత్రంలో ప్రత్యక్షంగా కొలువుదీరి ఉంటాడని అంటారు. ఇటు పురాణ పరమైన నేపథ్యం ... అటు చారిత్రక వైభవం కలిగిన ఈ క్షేత్రంలో 'కంచి' వరదరాజస్వామి వారు సైతం కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు.

ఇక ఈ క్షేత్రానికి వరదరాజస్వామి వారు రావడానికి ఓ కారణముంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన రాజావారు, కంచిలోని వైష్ణవ మతాచార్యుడికి మర్యాద పూర్వకమైన ఆహ్వానం పంపాడట. అయితే తాను నిత్య పూజలు నిర్వహించుకోవడానికిగాను ఆ ప్రాంతంలో వైష్ణవ ఆలయం ఉండాలనీ, అక్కడ అలాంటి ఆలయం లేదు గనుక తాను రాలేనని ఆయన కబురు పంపించాడు. అయితే ఆ వైష్ణవ మతాచార్యుడిని సేవించుకోవాలనే బలమైన సంకల్పంతో, ఆయన కోరిక మేరకు ఇక్కడ 'వరదరాజస్వామి' ఆలయం నిర్మించాలని రాజావారు నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా అందుకు తగిన ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఫలితంగా ఈ రోజున అందరూ దర్శించుకుంటోన్న వరదరాజస్వామి ఆలయం ఆవిర్భవించింది. ఈ కారణంగా శ్రీకాళహస్తి హరిహర క్షేత్రమై అలరారుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం రాజావారి విశాలమైన హృదయానికి అద్దం పడుతుంది. ఆలయం ప్రాకారాలపై గల దశావతార మూర్తులు కళ్ళను కట్టిపడేస్తారు. ఇక గర్భాలయంలో వరాలను వరదలా ప్రవహింపజేసే వరదరాజస్వామి సౌందర్యాన్ని తిలకించి పులకించవలసిందే.

ఇదే ప్రాంగణంలో శ్రీ కృష్ణుడు ... హనుమంతుడు మందిరాలతో పాటు రామానుజాచార్యుల వారి సన్నిధి కూడా దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన కంచి వరదరాజస్వామిని దర్శించిన ఫలితం కలుగుతుందని చెబుతారు. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి తరించే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది.


More Bhakti News