మనసుదోచే మణికంఠ క్షేత్రం

హరిహరులకు జన్మించిన ధర్మశాస్త ... మణిని మెడలో ధరించి మణికంఠస్వామిగా వెలుగొందుతున్నాడు. రాజ వంశీకులచే 'అయ్యా .. అప్పా' అంటూ ముద్దుగా పిలిపించుకుని, అయ్యప్పగా అశేష భక్త జనకోటి హృదయాల్లో కొలువుదీరాడు. అయ్యప్ప స్వామిని ఆరాధించడం వలన శివకేశవులను ప్రత్యక్షంగా పూజించిన ఫలితం దక్కుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో స్వామి దర్శన భాగ్యం కోసం శబరిమల వెళుతోన్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోండగా, అంతే వేగంగా అయ్యప్పస్వామి దేవాలయాలు వాడవాడలా ఆవిర్భవిస్తున్నాయి. అలా భక్త బృందం సహాయ సహకారాలతో నిర్మించబడిన అయ్యప్పస్వామి ఆలయం మనకి కర్నూలులో దర్శనమిస్తుంది. కార్తీకమాసం నుంచి సంక్రాంతి పండుగ వరకూ పెద్ద సంఖ్యలో వచ్చే అయ్యప్ప భక్తుల తాకిడిని తట్టుకునేలా ఈ ఆలయం నిర్మించబడింది.

ఆలయ ప్రాంగణంలో అతి భారీగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కనిపిస్తుంది. గర్భాలయంలో అయ్యప్ప స్వామి ఆత్మ - పరమాత్మల ఐక్యతను సూచిస్తూ 'చిన్ముద్ర' తో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి స్వామిని పూజించడం వలన అనేక దోషాలు నశిస్తాయని భక్తులు చెబుతుంటారు. ఇక ఈ క్షేత్రంలో గణపతి ... శివ పార్వతుల మందిరాలు కూడా దర్శనమిస్తూ వుంటాయి.

ఇక్కడి 'చౌడేశ్వరీ దేవి' ప్రత్యేకతను ... ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంటుంది. ఈ అమ్మవారిని వేడుకోవడం వలన సంతాన సౌభాగ్యాలు లభిస్తాయని అంటారు. ఇదే ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాలకి చెందిన అమ్మవారి రూపాలను దర్శించుకోవచ్చు. మనసుకు ప్రశాంతతను ... కోరిన వరాలను ప్రసాదించే ఈ క్షేత్రాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు ... దైవం యొక్క ఆశీస్సులను అందుకుని తరిస్తుంటారు.


More Bhakti News