వేల వెలుగుల వేంకటేశ్వరుడు

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి దిగివచ్చి ఆవిర్భవించిన కారణంగా తిరుమల తిరుపతి పవిత్రమైన దివ్య క్షేత్రమై అలరారుతోంది. స్వామివారు నడయాడిన ఆ పుణ్యస్థలి లోని గాలి తాకడం వలన శరీరం పవిత్రమవుతుంది. ఆ గాలిని పీల్చడం వలన ఆత్మ పరిశుద్ధమవుతుంది. అలా తిరుమల తిరుపతిలో స్వయం వ్యక్తమైన స్వామి, అనేక ప్రాంతాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో విలసిల్లుతోన్న ఆలయాలలో ఒకటి, ద్వారకా తిరుమల సమీపంలో గల'లక్ష్మీపురం'లో కనిపిస్తుంది. ఇక్కడ స్వామి వారు కొలువుదీరి ఇంత మంది భక్తులను అనుగ్రహిస్తూ ఉండటానికి కారణం, ఓ భక్తురాలి బలమైన సంకల్పం. చాలాకాలం క్రిందట 'పూరీ' కి చెందిన ఓ భక్తురాలు, తాను ఎంతగానో ఆరాధించే వేంకటేశ్వరస్వామివారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించింది. ఇక్కడి గర్భాలయంలో స్వామి వేల వెలుగులను విరజిమ్ముతుంటాడు.

అలాగే తరచూ పూరీలో తాను దర్శించుకునే శ్రీ జగన్నాథస్వామికి కూడా ఆ భక్తురాలు ఇదే ప్రాంగణంలో ఆలయం నిర్మించింది. గర్భాలయంలో జగన్నాథుడు ... బలభద్రుడు ... సుభద్రాదేవి దర్శనమిస్తుంటారు. ఆ రోజు నుంచి ఇక్కడి మూర్తులకు అంగరంగ వైభవంగా అన్నిరకాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఉత్సవాల సందర్భంగా జరిగే ఊరేగింపులలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. పరిసర ప్రాంతాలకి చెందిన గ్రామస్తులందరూ స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు.

ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగా ... లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగా స్థానికులు భావిస్తుంటారు. ప్రాచీనతకు ... పవిత్రతకు అద్దంపట్టే ఈ ఆలయ ప్రాంగణంలో, సీతారాముల ఆలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడి శ్రీనివాసుడిని దర్శించడం వలన ... తిరుమలను, జగన్నాథుడిని దర్శించడం వలన పూరీని, సీతారాములను దర్శించడం వలన భద్రాచాలాన్ని దర్శించిన ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అత్యంత విశిష్టత కలిగిన ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News