ఆశ్చర్య చకితులను చేసే రథ మంటపం

ప్రాచీనకాలం నాటి పుణ్యక్షేత్రాలను పరిశీలించినప్పుడు, అక్కడ భక్తితో పాటు శిల్పకళా వైభవం విలసిల్లిన తీరు కనిపిస్తుంది. ఆనాటి శిల్పులు ... వారి శిల్పకళా నైపుణ్యం మంత్ర ముగ్ధులను చేస్తుంది. అప్పట్లో కొందరు శిల్పులు ఏకశిలలను రథంగా మారిస్తే, మరికొందరు శిల్పులు మంటపాలకు రాతి గుర్రాలను ... చక్రాలను అమర్చి రథ మంటపాలతో సరికొత్త నిర్మాణ రీతులకు శ్రీకారం చుట్టారు.

ఈ విధంగా మంటపానికి ముందుభాగాన రెండు వైపులా రాతి గుర్రాలను ... రాతి చక్రాలను అమర్చిన తీరు మనకు నెల్లూరు జిల్లాలోని 'మల్లాం' లో దర్శనమిస్తుంది. అయితే ఈ మంటపం రాతి గుర్రాలతో కూడి వుండటం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ రథమంటపం నిర్మించబడిన తరువాత ఒక వైపు నుంచి మరో వైపుకి తిరిగిందట. ఈ కారణంగానే 'మల్లాం' ఊరు పేరు కాస్తా 'తిరుగుడు మల్లాం' గా మారిందని స్థల పురాణం చెబుతోంది.

పూర్వం ఇక్కడి రథ మంటపాన్ని శిల్పులుగా ప్రసిద్ధి చెందిన ఇద్దరు తండ్రీ కొడుకులు రూపొందించారట. రథ మంటపం అద్భుతంగా కుదరడంతో, శిల్పాచార్యుడి కొడుకు పొరుగు రాజ్యంలో గల తన ప్రియురాలిని కలుసుకుని ఆమెకి ఈ విషయం చెప్పాడు. ఆ రథ మంటపాన్ని చూడటానికి అంత దూరం తాను రాలేననీ, తనపై ప్రేమ ఉంటే ఆ రథ మంటపాన్నే తన దగ్గరికి తీసుకురమ్మని ఆమె కోరింది. అందుకు అవసరమైన కొన్ని మంత్ర విద్యలను కూడా అతనికి నేర్పించిందట.

దాంతో శిల్పాచార్యుడి కొడుకు రథమంటపం దగ్గరికి చేరుకొని, ఓ రాత్రి వేళ తన మంత్ర శక్తితో గుర్రాలకు జీవం పోసి ... మంటపం కదిలేలా చేస్తాడు. అంతే మంటపాన్ని లాక్కుని వెళ్లడానికి ప్రయత్నిస్తూ గుర్రాలు మరోవైపు తిరుగుతాయి. ఆ శబ్దానికి నిద్రలేచిన శిల్పాచార్యుడు, కొడుకు ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. భగవంతుడి సన్నిధిలో వుండే రథమంటపాన్ని ప్రియురాలి చెంతకు తరలించడం మహాపాపమని చెప్పి, ఆ రథమంటపం అక్కడే అలాగే ఆగిపోవాలంటూ దైవాన్ని ప్రార్ధిస్తాడు.

అంతే ఇటు గుర్రాల్లోను ... అటు మంటపంలోను చలనం ఆగిపోయి ఆ రథమంటపం అలాగే ఉండిపోయింది. మహిమాన్వితమైన ఈ సంఘటనను గురించి తెలుసుకున్న వాళ్లు, ఈ రథ మంటపం దగ్గర నుంచి ఒక పట్టాన కదల్లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


More Bhakti News