శివుడి జన్మనక్షత్రం రోజున ఏం చేయాలి?

పరమశివుడి లీలా విశేషాలను గురించి పురాణాలు అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. శంకరుడు తన భక్తులను అనుగ్రహించే తీరును గురించి ఎంతగా విన్నా ఇంకా వినాలనిపిస్తూనే వుంటుంది. నవరసాలను ... నవగ్రహాలను తన అధీనంలో నడిపించే నటరాజు గురించి ఎంతగా చెప్పుకున్నా తక్కువేననిపిస్తుంది.

సాధారణమైన రోజుల్లోనే సదాశివుడిని పూజించడం వలన అసాధారణమైన ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది సాక్షాత్తు పరమశివుడి జన్మ నక్షత్రమైన 'ఆరుద్ర' నక్షత్రం రోజున ఆయనని ఆరాధించడం వలన వచ్చే ఫలితం అనంతమైనదని అంటున్నాయి. ఆద్యంతాలు లేని ఆ మహాదేవుడికి, పుష్యమాసంలో వచ్చే 'ఆరుద్ర' నక్షత్రం రోజున వివిధ శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని, 'ఆర్ద్రోత్సవం' ఘనంగా జరుపుతారు. అత్యంత పవిత్రమైన ఈ రోజున శంకరుడిని శక్తి కొలది పూజించాలి. ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ అంకిత భావంతో అర్చించాలి. శివుడి జన్మ నక్షత్రమైన ఈ రోజున సాయంత్రం వేళ వరకూ ఉపవాసం వుండి, బిల్వ పత్రాలతో ఆయనని ఆరాధించాలి. ఇక ఈ రోజున స్వామివారిని పూజా మందిరంలో ఆరాధించడమే కాకుండా, ఆలయానికి వెళ్లి సాంబశివుడిని దర్శించుకోవాలి.

ఆయనకి ప్రదక్షిణలు చేసి ... అభిషేకం చేయించి ... దీపాలు వెలిగించాలి. వివిధ రకాల ఫలాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా శివయ్యను ఆయన జన్మ నక్షత్రం రోజున ఆరాధించడం వలన, సమస్త పాపాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News