తండ్రి కళ్లు తెరిపించిన కూతురు

చ్యవన మహర్షి చూపు కోల్పోవడానికి కారకురాలైన సుకన్య, వృద్ధుడైన ఆయన్ని వివాహం చేసుకుంటుంది. రాజ కుటుంబానికి చెందిన ఆమె, భర్తకు సేవలు చేస్తూ ఆశ్రమ జీవితం గడుపుతూ వుంటుంది. అశ్వనీ కుమారుల అనుగ్రహం కారణంగా చ్యవన మహర్షి చూపుతో పాటు, యవ్వనాన్ని పొందుతాడు. సుకన్యను చూడాలనిపించడంతో ఆమె తండ్రి తన పరివారంతో ఆశ్రమానికి చేరుకుంటాడు.

ఆ సమయంలో చ్యవన మహర్షితో సుకన్య అనురాగ సంభాషణను సాగిస్తూ వుంటుంది. యవ్వనంలో వున్న చ్యవన మహర్షిని సుకన్య తండ్రి గుర్తించలేకపోతాడు. భర్తను మోసం చేసి ఆమె పరపురుషుడితో చనువుగా ఉంటోందని భావిస్తాడు. ఆయనే చ్యవన మహర్షి అని సుకన్య ఎంతగా చెబుతున్నా ఆమె తండ్రి వినిపించుకోడు. తనతో పాటు వాళ్లిద్దరినీ రాజ్యానికి తీసుకువచ్చి, నిండుసభలో దోషులుగా ప్రవేశపెడతాడు.

చ్యవన మహర్షిని ఏం చేశావో చెప్పమంటూ సుకన్యను నిలదీస్తాడు. అయినా ఆమె అదే సమాధానం చెబుతూ ఉండటంతో ఆయన విసిగిపోతాడు. ఆ ఇద్దరికీ మరణ శిక్షను విధించమని మహా మంత్రిని ఆదేశిస్తాడు. మరణ దండనకి ముందుగా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునే అవకాశం సుకన్యకి ఇవ్వవలసిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని మహామంత్రి వ్యక్తం చేస్తాడు. రాజు అంగీకరించడంతో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రవేశం చేయమని సుకన్యను ఆదేశిస్తారు.

భర్త పాదాలకు నమస్కరించి అగ్నిప్రవేశం చేస్తుంది సుకన్య. అయితే ఆ మంటలు పూలహారాలై ఆమె మెడను అలంకరిస్తాయి. అది చూసిన సభికులంతా ఆశ్చర్యపోతారు. సుకన్య పాతివ్రత్యాన్ని గుర్తించి ఆమెకి వినయంగా నమస్కరిస్తారు. సుకన్యను అపార్థం చేసుకున్న ఆమె తండ్రి కళ్లు తెరుచుకుంటాయి. ఆమె మనసు గాయపడేలా ప్రవర్తించినందుకు ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు.


More Bhakti News