వైకుంఠ ఏకాదశి విశిష్టత

సంసారమనే సాగరాన్ని ఈదుతూ ... ఆటు పోట్లను ఎదుర్కుంటూ ... సుడిగుండాలను తప్పించుకుంటూ గమ్యాన్ని చేరుకోవడమే జీవితం. అయితే సంసారమనే సాగరాన్ని ఈదే క్రమంలో ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిపై భారం వేసి ముందుకుసాగుతుంటారు. బాధలు ... బాధ్యతలకి మధ్య నలిగిపోయిన వారికి భగవంతుడి యొక్క తత్త్వం పూర్తిగా అర్థమవుతుంది. ఆయన సహాయ సహకారాలతోనే తాము వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నామనే విషయం బోధపడుతుంది.

అంతగా తమకి చేయూతనిచ్చిన స్వామిని సగౌరవంగా కలుసుకుని సభక్తికంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకునే వారికి 'వైకుంఠ ఏకాదశి' కి మించిన అవకాశం లభించదు. ఈ రోజున స్వామి వైకుంఠంలోని పాలకడలిలో శేష తల్పంపై ఆశీనుడై దర్శనమిస్తాడు. అత్యంత పవిత్రమైన ఈ రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు గనుకనే దీనిని 'ముక్కోటి ఏకాదశి' అని అంటారు.

ఇక ఈ రోజున వివిధ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరం వైపున గల వైకుంఠ ద్వారాన్ని తెరచి, ఆ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని భక్తులకు కలిపిస్తూ వుంటారు. వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్న భక్తులకు, సాక్షాత్తు నిజ వైకుంఠంలో కొలువైన స్వామిని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. పాపాలను ప్రక్షాళన చేసుకుని పుణ్యమనే వెలుగులో మోక్షమార్గంలో ప్రయాణించాలనుకునేవారికి 'ముక్కోటి ఏకాదశి' కి మించిన వరం లేదు.

వ్రతాల్లో ఏకాదశి వ్రతానికి సాటియైనది లేదనీ, ఈ రోజున ఉపవాసం వుండి 'ఏకాదశి వ్రతం' ఆచరించిన వారికి విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 'మురాసురుడు' అనే రాక్షసుడిని సంహరించే సమయంలో, శ్రీమహావిష్ణువు శరీరంలో నుంచి 'ఏకాదశి' అనే కన్యక ఉద్భవించి ఆయనకి సహకరించింది. తనకి ఆమె సహకరించిన ఆ రోజు 'ఏకాదశి' పేరుతో స్థిరపడుతుందనీ, ఆ రోజున ఎవరైతే ఉపవసించి భక్తి శ్రద్ధలతో తనని సేవిస్తారో వారికి మోక్షం లభిస్తుందని శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడు.

అందువలన 'ఏకాదశి వ్రతం' చేయడం వలన పాపాలు ... కష్టాలు నశించి, పుణ్యప్రదమైన ... ఆనందకరమైన జీవితం లభిస్తుంది. ఇందుకు ఉదాహరణగా 'లుంభకుడు' అనే రాజకుమారుడి వృత్తాంతం మనకి పురాణాల్లో కనిపిస్తుంది. పరిస్థితులు ఎదురు తిరగడం వలన రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలైన ఈ రాజకుమారుడు, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన తిరిగి తన రాజ్యాన్ని పొందుతాడు.

ఈ వ్రతం కార్యానుకూలతను కలిగిస్తుంది కనుక దీనిని 'సఫల ఏకాదశి' అని కూడా అంటారు. ఇక వ్యాస మహర్షి ... పరాశర మహర్షి ... నారదుడు ... ప్రహ్లాదుడు ... భీష్ముడు మొదలైన వారంతా కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారే, అనంతమైన ఆ పుణ్య ఫలాలను అందుకుని తరించిన వారే.


More Bhakti News