గ్రహపీడలు తొలగించే ఆంజనేయుడు

జీవితంలో అనారోగ్యాలు ... అపమృత్యు భయాలు ... గ్రహపీడలు వెంటాడుతూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంటాయి. అలాంటి వాళ్లందరూ హనుమంతుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఆయన అనుగ్రహంతో అన్ని దోషాల నుంచి బయటపడొచ్చని బలంగా విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో హనుమంతుడు కొలువుదీరిన క్షేత్రాలను దర్శించి, ఆయన అభయాన్ని అందుకుంటూ వుంటారు.

అలా భక్తులచే ఆరాధనలు అందుకుంటోన్న హనుమంతుడి ఆలయం మనకి తూర్పు గోదావరి జిల్లా 'రాజోలు' లో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనదనీ, చారిత్రకమైనదని స్థలపురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రదేశంలో ఓ యాగాన్ని నిర్వహించాలని అనుకున్న వశిష్ఠ మహర్షి, ఆ యాగ సంరక్షనార్థం హనుమంతుడిని ప్రార్ధించాడట. యాగం పూర్తయిన తరువాత మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆవిర్భవించాడు.

ఆ తరువాత కాలంలో స్వామివారికి ఆలయం నిర్మించబడింది. గోదావరి నదీ తీరంలో ... ప్రశాంతమైన వాతావరణంలో విలసిల్లుతోన్న ఈ ఆలయం చూసి తీరవలసిందే. గర్భాలయం విమానంపై వివిధ రకాల భంగిమల్లో కనిపించే ఆంజనేయస్వామి ప్రతిమలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంటాయి. గర్భాలయంలో స్వామి వారి ప్రతిమ చిన్నదే అయినా, కుదురుగా చక్కగా కనిపిస్తూ వుంటుంది.

ఇక్కడి స్వామిని పూజించడం వలన, గ్రహ సంబంధమైన పీడల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు. హనుమజ్జయంతి ఉత్సవం ఈ క్షేత్రంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన కృపాకటాక్షాలతో తరిస్తుంటారు.


More Bhakti News