భక్తుడిని దహించలేని మంటలు !

కబీర్ దాస్ పద్ధతిపట్ల ఆయన మతస్తులు తీవ్రమైన అసహనానికి లోనవుతారు. ఆయన కారణంగా గ్రామంలో గొడవలు జరుగుతాయని భయపడి, సికిందర్ పాదుషాకి ఫిర్యాదు చేస్తారు. ఆయన కబీర్ దాస్ ని పిలిపించి మందలిస్తాడు. చూసే దృష్టి వేరనీ ... అందరినీ కాపాడే దేవుడు ఒక్కడేనని ఆయనతో చెబుతాడు కబీర్. తనకే పాఠాలు చెబుతున్నాడని భావించిన ఆయన, కబీరును కఠినంగా శిక్షించడానికి సిద్ధపడతాడు.

తనని శిక్షించినా భగవంతుడి పట్ల తన ఉద్దేశం మారదని తేల్చి చెబుతాడు కబీర్. దాంతో ఆగ్రహావేశాలకు లోనైన పాదుషా, కబీరును మంటల్లోకి తోసేయమని తన వాళ్లను ఆదేశిస్తాడు. దాంతో వాళ్లు కబీర్ ను బంధించి చుట్టూ మంటపెడతారు. ఆ మంటల్లో కబీర్ కాలిపోవడం ఖాయమని అంతా అనుకుంటారు. కానీ ఆ మంటలు ఆయనని సమీపించక పోవడం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మంటలు పెట్టిన పాదుషా సైనికులు ఒళ్లంతా మంటలు అంటూ బాధతో విలవిలలాడి పోసాగారు. ఈ విషయం తెలిసి హడావిడిగా అక్కడికి వచ్చిన పాదుషా చూపును కోల్పోతాడు. హఠాత్తుగా గాడాంధకారం అలుముకోవడంతో, పాదుషా కంగారుపడసాగాడు. కబీర్ ను బంధించిన సంకెళ్లు వాటంతట అవి తెగిపోతాయి. పాదుషా దగ్గరికి వచ్చి ఆయన కళ్లను తన చేతితో తాకుతాడు. అంతే పాదుషాకి చూపువస్తుంది ... ఆనందంతో ఆయన పొంగిపోతాడు.

కబీరు స్పర్శతో పాదుషా సైనికులు సైతం అప్పటివరకూ తాము అనుభవించిన బాధల నుంచి విముక్తి పొందుతారు. కబీరును ఆలింగనం చేసుకుని అసమానమైన ఆయన భక్తిని ప్రత్యక్షంగా తెలుసుకున్నానని పాదుషా చెబుతాడు. అహంకారంతో ... అజ్ఞానంతో ప్రవర్తించిన తనని మన్నించమని కోరతాడు. ఇకపై ఆయన ఆరాధనలకు .... బోధనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని చెప్పి సగౌరవంగా సాగనంపుతాడు.


More Bhakti News