అడిగిన వరాలనిచ్చే అభయ నారసింహుడు

తల్లిదండ్రులకు తమ కూతురు వివాహానికి మించిన సమస్య ఏదీ వుండదు. కూతురికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరినట్టుగా వాళ్లు భావిస్తారు. అలాగే కొత్తగా పెళ్లైన జంట, సంతానం విషయంలో ఆలస్యమవుతున్నా కొద్దీ ఆందోళన చెందుతూ వుంటారు. తమని కరుణించే దైవాన్ని అన్వేషిస్తూ గుళ్లకీ ... గోపురాలకి తిరుగుతుంటారు.

అలాంటి భక్తులకు తాను ఉన్నానంటూ అనుగ్రహించే లక్ష్మీనరసింహస్వామి మనకి 'లింబాద్రి గుట్ట' లో కనిపిస్తాడు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల పరిధిలో కనిపించే ఈ క్షేత్రం పూర్వనామం 'నింబాద్రి గుట్ట'. ఇక్కడ అనేక వేప వృక్షాలు వుండటం వలన ఈ ఊరుకి ఈ పేరు వచ్చింది. కాలక్రమంలో అది 'లింబాద్రి గుట్ట' గా మార్పు చెందింది.

హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఇక్కడి వేపచెట్ల చల్లదనంలో స్వామి సేదదీరి, ప్రహ్లాదుడి కోరికమేరకు ఇక్కడే వెలిశాడని స్థలపురాణం చెబుతోంది. పవిత్రమైన ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన స్వామిని ముందుగా బ్రహ్మదేవుడు - సరస్వతీదేవి, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు దర్శించుకున్నారు. ఆ తరువాత కాలంలో ఎందరో రాజులు స్వామివారిని సేవించి తరించారు.

ఇటు పురాణ పరంగా ... అటు చారిత్రక పరంగా తన ఘనతను చాటుకున్న ఈ క్షేత్రం భక్తులపాలిట కొంగుబంగారమై అలరారుతోంది. భక్తులు ముందుగా ఇక్కడి 'పద్మ పుష్కరిణి' (నంది కొలను ) లో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు. మహిమాన్వితమైన ఇక్కడి కోనేరు మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. కార్తీకమాసంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు.

ఈ సందర్భంగా వివిధ రకాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తూ వుంటారు. ఆ వైభవాన్ని చూసిన భక్తులు తమ జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు. సంతానం లేనివారు దైవ సన్నిధిలో 'పోలుదారం' కట్టుకుంటారు. అలాగే వివాహం ఆలస్యమవుతోన్న వాళ్లు స్వామివారికి కల్యాణోత్సవం సమయంలో 'బాసికాలు' సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆశించిన ఫలితాలు లభిస్తాయని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News