ఇంట్లో నవగ్రహ చిత్రపటాలు ?

ఎవరి ఇంట్లో వాళ్లు తమకి ఇష్టమైన దేవతా చిత్రపటాలు పెడుతూ వుంటారు. కొన్ని చిత్రపటాలు పూజగదిలో వుంటే, మరికొన్ని చిత్రపటాలు హాల్లోని గోడలకి కనిపిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో కొందరు నవగ్రహాలు గల చిత్ర పటాలను కూడా ఇంటికి తీసుకుని వస్తుంటారు. గ్రహాల అనుకూలత అన్నివేళలా అవసరం గనుక, ప్రతినిత్యం వాటిని పూజించాలనే ఉద్దేశం వాళ్లలో కనిపిస్తూ వుంటుంది.

అయితే నవగ్రహాలు గల చిత్రపటాలు ఇంట్లో ఉండకూడదని ఎవరైనా వాళ్లతో అంటే, వెంటనే వాటిని పూజా మందిరంలో నుంచి తీసి హాల్లో గోడకి తగిలించేస్తారు. అక్కడ కూడా ఉండకూడదని ఎవరైనా అంటే దాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ వుంటారు. పూజా మందిరంలో నవగ్రహాలను ఆరాధించకూడదేమోనని అనుకుంటూ వుంటారు.

అయితే భగవంతుడి అవతారాలకు ... నవగ్రహాలకు అవినాభావ సంబంధం వుందనే విషయాన్ని గమనించాలి. భగవంతుడి అవతారాలను పూజిస్తూనే వుంటారు గనుక, ఆ ఆరాధన నవగ్రహాలకు చేరుతూనే వుంటుంది. నవగ్రహాలకు చేసే ప్రదక్షిణలు ... అభిషేకాలు అతి ముఖ్యమైనవి గనుక, దేవాలయంలోనే ఆ పని చేయవలసి వుంటుంది. అందువలన చిత్రపటాల ప్రాముఖ్యత అంతగా కనిపించదు.

ఇక ఇంట్లో ఆయా దేవతల చిత్రపటాలు ఉన్నప్పటికీ, ఏదో ఒక దైవాన్ని ఇష్టదైవంగా స్వీకరించి పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఒకే దైవాన్ని ఎంచుకోవడం వలన ఏకాగ్రత కుదురుతుంది. ఆ దైవంపై బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. అదే పనిగా ఆ దైవాన్ని ఆరాధించడం వలన, ఆ దైవం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది.


More Bhakti News