శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం

తిరుమల కొండపై స్వామికి కైంకర్యాలు నిర్వహించే బాధ్యతను రామానుజాచార్యుల వారి శిష్యుడైన అనంతాచార్యులు స్వీకరిస్తాడు. స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరించాలనే ఉద్దేశంతో, ఆ పూల మొక్కల పెంపకానికి అవసరమైన నీటి కోసం చెరువును తవ్వడం మొదలుపెడతాడు. చిన్న 'గడ్డపలుగు'తో అనంతాచార్యులు మట్టి తవ్వుతూ వుంటే, నిండు చూలాలైన ఆయన భార్య ఆ మట్టిని తట్టతో ఎత్తి దూరంగా పోసి వచ్చేది. ఇలా కొన్ని రోజులు గడిచాక, తన కోసం ఆ నిండు చూలాలు కష్టపడటం స్వామికి బాధకలిగిస్తుంది.

దాంతో ఆయన బాలుడి రూపంలో ఆ దంపతుల దగ్గరికి వెళ్లి, తాను సాయం చేస్తానని చెబుతాడు. స్వామి సేవలో తమకి మరొకరి సాయం అవసరం లేదనీ, ఇష్టంతో చేసే పని కష్టంగా అనిపించదని అంటాడు అనంతాచార్యులు. అయినా ఆ నిండు చూలాలు ఇబ్బంది చూడలేక, సాయం చేయడం కోసం ఆ బాలుడు ఆమె చేతిలో నుంచి మట్టితట్టను లాక్కుంటాడు.

వద్దన్నా వినిపించుకోవడం లేదని ఆగ్రహించిన అనంతాచార్యులు ఆ బాలుడిని బెదిరించడం కోసం తన చేతిలోని గుణపాన్ని విసిరేస్తాడు. అయితే నిజంగానే వెళ్లి అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది. రక్తం కారుతూ ఉండటంతో ఆ బాలుడు అక్కడి నుంచి పరిగెత్తాడు. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆలయానికి చేరుకున్న అనంతాచార్యులు, గర్భాలయంలోని మూలమూర్తి గడ్డం నుంచి రక్తం వస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోతాడు.

తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు, సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడని గ్రహించి కన్నీళ్లతో స్వామి పాదాలపై పడతాడు. తనని మన్నించమని కోరుతూనే, గాయం వలన స్వామికి కలుగుతోన్న బాధ ఉపశమించడం కోసం అక్కడ పచ్చకర్పూరం అద్దుతాడు. అలా ఆయన ప్రతి రోజూ చల్లదనం కోసం గాయమైన చోట గడ్డానికి చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అలా స్వామివారి మూలమూర్తికి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది.


More Bhakti News