సిరిసంపదల నిచ్చే లక్ష్మీ శ్రీనివాసుడు

ఓ వైపున ఆధ్యాత్మిక సంపద ... మరోవైపున చారిత్రక వైభవం కలిగిన క్షేత్రాలు విశిష్టమైనవిగా వెలుగొందుతూ వుంటాయి. అక్కడి స్థల పురాణాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అవి మహిమాన్వితమైనవనే విషయం అర్థమవుతూ వుంటుంది. అలాంటి ఆధ్యాత్మిక ... చారిత్రక నేపథ్యం కలిగన పుణ్యక్షేత్రంగా 'దేవుడి కడప' దర్శనమిస్తుంది. కడప జిల్లాలోని ఈ దివ్యక్షేత్రం భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది.

దేవాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలం ... పొడవైన ప్రాకారాలు ... ఎత్తయిన రాజగోపురం ... విశాలమైన మంటపాలు గతవైభవానికి నిదర్శనమై నిలుస్తుంటాయి. ఇక స్వామి ఇక్కడ ఆవిర్భవించిన తీరు ఆసక్తికరంగా వుంటుంది. పూర్వం ఇక్కడ హనుమంతుడి ఆలయం మాత్రమే ఉండేదట. పవిత్రమైన ఈ ప్రదేశంలో వేంకటేశ్వర స్వామి కూడా వుంటే బాగుంటుందని భావించిన ఓ భక్తుడు, ఆయన గురించి అదే పనిగా ధ్యానం చేశాడు.

ఆ భక్తుడి విన్నపం మేరకు లక్ష్మీ సమేతుడై స్వామి ఇక్కడ ఆవిర్భవించాడు. ఆనాటి నుంచి లక్ష్మీ వేంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమైన పాత్రను పోషించాడు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. గర్భాలయంలో స్వామి దివ్య మైన తేజస్సును వెదజల్లుతూ వుండగా, పద్మావతి అమ్మవారు - గోదాదేవి ప్రత్యేక మందిరాలలో దర్శనమిస్తూ వుంటారు.

ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి సైన్యాధిపతి అయిన విష్వక్సేనుల వారు కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ వుండటం విశేషం. విశేషమైన పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. తిరుమల బాలాజీకి అనుకున్న మొక్కులను, వీలునుబట్టి ఈ క్షేత్రంలో చెల్లించుకుంటూ వుంటారు. ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించడం వలన దారిద్ర్యం ... దుఃఖం నశించి, సంపదలు ... సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News