వరాలనిచ్చే చల్లని తల్లులు

ఆపద కలిగినప్పుడు 'అమ్మా' అనే మాట సహజంగా వచ్చేస్తుంది. అలాగే ఆకలి వేసినప్పుడు కూడా 'అమ్మా' అనుకుంటూనే అ బాధను తట్టుకోవడం జరుగుతుంది. అమ్మ ప్రేమ ఆవేదనకు మందులా పనిచేస్తుంది. అమ్మ అనురాగం ముంచుకొస్తోన్న మృత్యువును సైతం తరిమికొడుతుంది. అలాంటి అమ్మలకే తల్లులుగా శ్రీ లక్ష్మీదేవి ... పార్వతీదేవి ... సరస్వతీదేవి యుగయుగాలుగా పూజలు అందుకుంటున్నారు.

ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకే ప్రాంగణంలో కొలువై వుండటం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. అలాంటి విశిష్టమైన క్షేత్రం మహారాష్ట్ర - పూణె లోని 'సరస్ బాగ్'లో దర్శనమిస్తుంది. చాలాకాలం క్రిందట శ్రీమంతులైన దంపతులు ఈ ప్రదేశంలో ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ వుండగా, త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు వారి కలలో కనిపించి తమకి ఆలయం నిర్మించమని ఆదేశించిందట. దాని ఫలితంగానే ఇక్కడ అద్భుతమైన నగిషీలతో మలచబడిన అద్వితీయమైన ఆలయం రూపుదాల్చింది.

సువిశాలమైన ఈ ప్రదేశంలో లక్ష్మీదేవి ... సరస్వతీ దేవి ... మహాకాళీ ఆలయాలు వరుసగా కనిపిస్తాయి. లక్ష్మీదేవి ... సరస్వతీదేవి మూలమూర్తులు పాలరాయితోను, మహాకాళి మూలమూర్తి నల్లరాయితోను మలచడం జరిగింది. సరస్వతీదేవి మూలమూర్తి వీణను ధరించి నుంచుని వుండటం ఇక్కడి విశేషంగా చెబుతారు. అయిదు అడుగులపైన గల ఈ విగ్రహాల్లో జీవం ఉట్టిపడుతూ వుంటుంది.

ఈ ముగ్గురు అమ్మవార్లను, కోరినవరాలను ప్రసాదించే చల్లని తల్లులుగా భక్తులు భావిస్తుంటారు. అమ్మవార్లను దర్శించడం వలన సంపద ... విద్య .. విజయం చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. విశేషమైన పుణ్యతిథుల్లో అమ్మవార్లకి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పునీతులవుతుంటారు.


More Bhakti News