పుట్టుమచ్చలు (చేతులు)

'కుడిచేతి భుజం'పై పుట్టుమచ్చగల వారిలో పట్టుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఆత్మ విశ్వాసంతో అనుకున్నపని సాధిస్తారు. దూకుడుగా కనిపించినప్పటికీ, వివేకం కారణంగా విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక 'ఎడమచేతి భుజం'పై పుట్టుమచ్చగల వారిలో పంతాలు - పట్టింపులు ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్లు ఆత్మ విశ్వాసమని అనుకునేది ఇతరులకు మూర్ఖత్వంగా అనిపించి దూరం పెట్టే అవకాశాలు లేకపోలేదు. నలుగురూ ఏమనుకున్నా అన్న వస్త్రాలకు ఎలాంటి లోటు లేకుండా వీరి జీవితం సాగిపోతుంది.

ఇక 'కుడిచేయి'పై పుట్టుమచ్చ వుంటే ... పట్టుదల ఎక్కువగా వుంటుంది. అనుకున్నపని పూర్తయ్యేంత వరకూ వీరు విశ్రాంతి తీసుకోరు. న్యాయంగా ఉండటానికి ... ధర్మంగా నడుచుకోవడానికి వీళ్లు ఇష్టపడతారు. ఆరోగ్యంగా ... బలంగా కనిపించే వీళ్లు చురుకుగా ఉండటమే కాకుండా, ప్రతిపనిలోను చొరవ చూపిస్తూ అనుకున్నది సాధిస్తారు.

'ఎడమచేయి'పై పుట్టుమచ్చ వుంటే ... వీలైనన్ని మార్గాల్లో ఆలోచించే శక్తి తక్కువగా వుంటుంది. ఏదో ఒక పని అనుకుని దానిని పూర్తి చేయడానికే సమయాన్నంతా కేటాయిస్తుంటారు. కష్టపడే మనస్తత్వం ఉన్నప్పటికీ వీరు చేసే ప్రయత్నాలు కొంత వరకు మాత్రమే ఫలించి, సాధారణమైన జీవితాన్నే గడుపుతుంటారు.

'ముంజేయి'పై పుట్టుమచ్చ వుంటే ... కాలం అనుకూలమవుతుంది. వీరు ఏ పని చేసినా కాసుల వర్షం కురుస్తుంది. ముందు చూపుతో చేసే పనులు ... తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధు మిత్రులలో మంచి పేరు సంపాదించుకునే వీరు, కొన్ని రకాల వ్యసనాలకు దూరంగా వుండలేకపోతారు.

'మోచేతి'పై పుట్టుమచ్చ అనుకున్న కార్యాలను నెరవేరుస్తుంది. ఈ పుట్టుమచ్చ వున్న వారు ఏదో ఒక కళా రంగంలో రాణిస్తారు. సహాయాన్ని కోరడంలో కన్నా సహాయపడటంలోనే వీరు ముందుంటారు. మంచి మనసున్న వీరిని సిరి సంపదలు పలకరిస్తుంటాయి ... ఆనందానుభూతులను అందిస్తుంటాయి.

స్త్రీలకు మోచేతిపై పుట్టుమచ్చ ... అహంకారానికి ... ఆత్మ విశ్వాసానికి ఆనవాలుగా కనిపిస్తుంది. వీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇక ఆ విషయంలో ఎవరి మాటా వినరు. ఎలాంటి కష్టాలు ఎదురైనా తాము అనుకున్నది సాధించగలుగుతారు.


More Bhakti News