గండాలు తొలగించే గణపతి

ఎవరు ఏ రంగంలోకి అడుగుపెట్టాలన్నా ... ఆ రంగంలో తిరుగులేని విజయాన్ని సాధించాలన్నా అందుకు గణపతి అనుగ్రహం కావాలి. గణపతి ఆరాధన మార్గాన్ని సుగమం చేస్తుంది ... అనుకున్నది సాధించడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. అందుకే అందరూ ప్రతినిత్యం గణపతిని పూజిస్తుంటారు ... ఆయనకి సంతృప్తిని కలిగించేలా సేవిస్తుంటారు.

అలా అశేష భక్త జనులచే నిత్య నీరాజనాలు అందుకుంటోన్న గణపతి క్షేత్రంగా ' రేజింతల' దర్శనమిస్తోంది. మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ దివ్య క్షేత్రం మెదక్ జిల్లా పరిధిలో విలసిల్లుతోంది. ఇక్కడి గణపతి తనంతట తానుగా భూమిలో నుంచి పైకి తన్నుకు వచ్చాడని స్థలపురాణం చెబుతోంది. 17 వ శతాబ్దం తొలినాళ్లలో కర్ణాటక ప్రాంతానికి చెందిన 'శివరామ్' అనే భక్తుడు నిరంతరం గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడట. శివరామ్ భక్తికి మెచ్చిన వినాయకుడు ప్రతినిత్యం ఆయన ఎదుట ప్రత్యక్షమై నైవేద్యాలు స్వీకరించేవాడు.

ఈ నేపథ్యంలోనే శివరామ్ అనేక క్షేత్రాలను దర్శిస్తూ ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఎప్పటిలానే శివరామ్ ఆరాధించగానే గణపతి భూమిలో నుంచి పైకి వచ్చి నైవేద్యాలు స్వీకరించాడు. పవిత్రమైన ఈ ప్రదేశంలో ఆవిర్భవించవలసిందిగా శివరాం కోరగా, భక్తులను అనుగ్రహించడం కోసం స్వామి శిలగా మారిపోయాడు. అలా స్వయంభువుగా ఆవిర్భవించిన వినాయకుడికి ఆలయాన్ని నిర్మించి పూజించడం మొదలైంది.

అప్పట్లో స్వామి విగ్రహ పరిమాణం రెండు అడుగుల లోపు ఉండేదట. అలాంటి విగ్రహం నేడు ఆరు అడుగులకి పైగా వుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని చెప్పడానికి ఇది నిదర్శనమని భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. సిందూర వర్ణంలో దర్శనమిచ్చే ఇక్కడి వినాయకుడిని పూజించడం వలన గండాలు గట్టెక్కుతాయనీ, ఆటంకాలు తొలగిపోయి ఆశించిన శుభాలు జరుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

స్వామి ఆవిర్భవించిన రోజుని పురస్కరించుకుని ప్రతియేటా పుష్యమాసం (జనవరి ) ప్రారంభమైన తొలి నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. స్వామికి తమ మనసులో మాటను విన్నవించుకుని కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తూ వుంటారు.


More Bhakti News