పార్వతీదేవి పరీక్ష !

అనసూయాదేవి పాతివ్రత్యం గురించి తెలుసుకున్న పార్వతీదేవి, ఆమె పాతివ్రత్య మహిమను పరీక్షించాలని అనుకుంటుంది. అనసూయాదేవి మహా పతివ్రతయే అయితే ఆమె మాంగళ్యాన్ని కాపాడుకునే శక్తి ఆమెకి వుందో ... లేదో చూడాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నదే తడవుగా అత్రి మహర్షిని కాటు వేయమని, పరమశివుడి మెడలోని నాగరాజుని పంపిస్తుంది.

అనసూయాదేవి పాతివ్రత్య మహిమను గురించి తెలిసిన పరమశివుడు, పార్వతీదేవి ప్రయత్నాన్ని చూసి మనసులోనే నవ్వుకుంటాడు. పార్వతీదేవి ఆదేశం మేరకు నాగరాజు భూలోకంలోని అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ సమయంలో అత్రి మహర్షి ధ్యానంలో వుండగా, అక్కడి ఏర్పాట్లను అనసూయామాత చూసుకుంటూ వుంటుంది. నాగరాజు రాకను గమనించిన అనసూయాదేవి, ఆత్మీయంగా ఆహ్వానం పలికి ఆరాధిస్తుంది.

శివలింగానికి అలంకరించబడి వున్న పూలమాలను ఆమె నాగరాజుకి సమర్పిస్తుంది. ఆ మహా ఇల్లాలికి భక్తి శ్రద్ధల కారణంగా తన కంఠంలోని విషం కూడా అమృతంలా మారిపోయిందేమోననే సందేహం నాగరాజుకి కలుగుతుంది. దాంతో పార్వతీదేవి ఆదేశాన్ని ఆచరణలో పెట్టడానికి నాగరాజుకి మనసు అంగీకరించదు. అనసూయాదేవి నైవేద్యంగా సమర్పించిన పాలను సేవించి, అత్రి మహర్షికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరుతాడు నాగరాజు.

తాను అప్పగించిన పని చేయకుండగా తిరిగి వచ్చిన నాగరాజు తీరు పట్ల పార్వతీదేవి తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. నాగరాజుని కోపించడం తగదనీ, అత్రి మహర్షి ఆశ్రమంలో అడుగుపెట్టిన ఎవరికైనా విపరీతమైన ఆలోచనలు రావని చెబుతాడు పరమశివుడు. అనసూయాదేవి పాతివ్రత్య మహిమ అంతగా ప్రభావితం చేస్తుందని అంటాడు. మరోమారు ఆమె పాతివ్రత్య మహిమను పరీక్షించే ప్రయత్నం చేయ వద్దని పార్వతీదేవికి నచ్చజెబుతాడు.


More Bhakti News