పుట్టుమచ్చలు (హృదయం - పొట్ట)

'హృదయస్థానం'పై పుట్టుమచ్చ వుంటే ... శ్రీమంతులవుతారని శాస్త్రం చెబుతోంది. హృదయ స్థానంలో పుట్టుమచ్చ వుంటే తాము అనుకున్నది సాధించాలానే పట్టుదల ... చివరి వరకూ పోరాడాలనే ధైర్యాన్ని కలిగి వుంటారు. ఇక హృదయానికి 'కుడి భాగంలో' పుట్టుమచ్చ వుంటే ... పరువు ప్రతిష్ఠల కోసం ప్రాణాలిచ్చే వారిగా పేరు తెచ్చుకుంటారు. ఆడ సంతానంవల్ల ఆ ఇల్లు కళకళలాడుతూ వుంటుంది.

'కుడిరొమ్ము'పై పుట్టుమచ్చ కారణంగా ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురవుతూ వుంటాయి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండకుండా తరచూ అబద్ధాలు ఆడుతూ వుంటారు. ఇక రొమ్ముల మధ్య భాగంలో పుట్టుమచ్చ, ఎక్కడా నిలకడలేని తనాన్ని సూచిస్తుంది. వీరు ఏ పనిని ప్రారంభించినా దానిని పూర్తి చేయలేక, ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడుతుంటారు. వీరు భక్తి భావంతో కనపడుతున్నప్పటికీ, అప్పుడప్పుడు కొన్ని రకాల వ్యామోహాలకి లోనవుతుంటారు.

ఇక స్త్రీల విషయానికి వస్తే ... 'కుడి వైపున' పుట్టుమచ్చ మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ప్రతి స్త్రీ తన వైవాహిక జీవితం ఎలా వుండాలని కోరుకుంటుందో, అలాగే దేనికీ లోటు లేకుండా వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇక ఎడమ వైపున పుట్టుమచ్చ ఉన్నా వారి జీవితం చీకూచింతా లేకుండా హాయిగా గడిచిపోతుంది. మంచి ఆయుష్మంతులైన కారణంగా, వారి కుటుంబం యొక్క పరువు ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. పదవిలో భర్త ... విద్యల్లో సంతానం రాణిస్తూ వాళ్ల కలలు నిజమవుతుంటాయి.

ఇక 'పొట్ట'పై పుట్టుమచ్చ వున్న వారు బాధ్యతలు మోయడానికి భయపడరు. వీరు డబ్బు బాగా సంపాదించడమే కాకుండా, ఆ డబ్బుతో వ్యాపార లావాదేవీలను నిర్వహించడంలో చురుకైన పాత్రను పోషిస్తారు. సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ధైర్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు పోతుంటారు.

'పొట్టపై కుడి భాగంలో' పుట్టుమచ్చ వుంటే ... సమాజంలో పరువు ప్రతిష్ఠలు లభిస్తాయి. కష్టానికి మించిన ప్రతిఫలంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. 'పొట్ట ఎడమ భాగంలో' పుట్టుమచ్చ వుంటే ... దురాశాపరులై వుంటారు. ఏదైనా సరే తమ ప్రయత్నం ... ప్రమేయం లేకుండా వచ్చి పడాలని చూస్తారు. అసూయ ... ద్వేషాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. స్త్రీలకు పొట్టపై పుట్టుమచ్చ మంచి సంతానాన్ని సూచిస్తుంది. వీరు అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి పేరు సంపాదించుకుంటారు.


More Bhakti News