పెళ్లికి ముందే బంగారు ఆభరణాలు

భారతీయుల ఆచారవ్యవహారాలను వివాహ వేడుక మాత్రమే పూర్తిస్థాయిలో ఆవిష్కరిస్తూ వుంటుంది. ఆచారవ్యవహారాలకు సంబంధించిన అన్ని అంశాలు వివాహ వేడుకలో భాగంగా చోటుచేసుకుంటూ వుంటాయి. ఈ కారణంగానే వివాహానికి ఒక విశిష్టమైన గుర్తింపు లభించింది. ఇక పెళ్లంటే అటు అమ్మాయి తరఫు వాళ్ల ఇంట్లోను ... ఇటు అబ్బాయి తరఫు వాళ్ల ఇంట్లోను హడావిడి ... సందడి కనిపిస్తుంటాయి.

పసుపు కొట్టడంతో పెళ్లికి సంబంధించిన పనులకు శ్రీకారం చుడతారు. అప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో ఈ రెండు కుటుంబాలు పూర్తిగా నిమగ్నమై వుంటాయి. సమయం లేదనుకుంటూ చకచకా పెళ్లి పనులను చక్కబెడుతూ వుంటారు. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, ఆ సమయానికి అవి అందుతాయో లేదోనని ఆందోళన చెందుతూ వుంటారు.

ఈ సందర్భంలోనే కొంతమంది పెళ్లికి సంబంధించిన ఆభరణాలను ముందే చేయించుకుని వుంటే బాగుండేదని అనుకుంటూ వుంటారు. అయితే అలా ముందేకొని పెట్టుకోవచ్చా? అనే సందేహం కొంతమందిలో తలెత్తుతూ వుంటుంది. కూతురుకి పెళ్లి చేయాలనే ఆలోచన రాగానే అందుకు సంబంధించిన బంగారు వస్తువులను ముందస్తుగా సిద్ధంచేసి ఉంచాలని కొందరు అనుకుంటూ వుంటారు. పెళ్లి అనే పేరు మీద ముందుగానే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం వలన వివాహం ఆలస్యమవుతుందని మరికొందరు చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో ఆడపిల్లల తల్లిదండ్రులు అయోమయానికి లోనవుతుంటారు. సాధారణంగా ఆడపిల్ల పెళ్లికని తల్లిదండ్రులు ముందుచూపుతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తారు. అదే జాగ్రత్తని వాళ్లు బంగారు ఆభరణాల విషయంలోనూ చూపించ వచ్చని శాస్త్రం చెబుతోంది. ఆడపిల్ల పెళ్లికని ముందుగానే ఆభరణాలు కొనడం వలన వివాహం ఆలస్యం కావడమంటూ జరగదనీ, ఆభరణాలు కొన్న సమయం మంచిదైతే ఆ కారణంగా సంబంధాలు కుదిరే అవకాశం కూడా లేకపోలేదని స్పష్టం చేస్తోంది.


More Bhakti News