పుష్పక విమానంలో పక్షిరాజు

పుష్పక విమానం అనే పేరు వినగానే మనసంతా ఒకరకమైన ఉత్సాహంతో నిండిపోతుంది. ఎందుకంటే పూర్వం ఈ పుష్పక విమానాల్లో దేవతలు తిరిగినట్టుగా చదువుకున్న కథలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. కొందరు మహా భక్తులను సశరీరంగా వైకుంఠానికి తీసుకు వెళ్లడానికి ఈ పుష్పక విమానాలు వచ్చినట్టుగా విన్న కథలు గుర్తుకు వస్తుంటాయి. అలాంటి అందమైన కథ ఒకటి నిజామాబాద్ జిల్లా భీంగల్ సమీపంలో గల 'లింబాద్రి గుట్ట' క్షేత్రంలో వినిపిస్తుంది.

ప్రహ్లాదుడి ప్రార్ధన మేరకే ఈ క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి ఆవిర్భవించినట్టు ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో గల 'నంది కొలను' మహా మహిమాన్వితమైనదిగా చెబుతుంటారు. పూర్వం భ్రుగుమహర్షి శాపానికి గురైన నందీశ్వరుడుకి ఈ కొలనులో స్నానం చేసిన తరువాతే శాప విమోచనం కలిగిందట. దాంతో ఇది నంది కొలనుగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా వివిధ క్షేత్రాల్లోని కోనేరుల్లో స్నానమాచరించడం వలన పాపాలు నశించి పుణ్య ఫలాలు లభిస్తాయని చెబుతుంటారు. అందుకు ఉదాహరణగా పూర్వకాలంనాటి కథలు చెబుతుంటారు.

ఇక ఇక్కడి కోనేరు కూడా ఎంతో మహిమాన్వితమైనదని స్థానికులు చెబుతుంటారు. చాలాకాలం క్రిందట ఓ గద్ద ఈ కోనేరులో పడి చనిపోయిందట. ఆ చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే అది నిజ రూపాన్ని పొందడం ... అంతలో ఓ పుష్పక విమానం వచ్చి ఆ పక్షి రాజుని తీసుకుని వెళ్లడం జరిగిపోయాయి. ఈ అరుదైన .. అద్భుతమైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ఇప్పుడు సజీవంగా లేకున్నా, వాళ్ల ద్వారా విన్నవాళ్లు ఎంతో ఆసక్తి కరంగా ఈ విషయాన్ని చెబుతుంటారు. మహిమాన్వితమైన ఈ కోనేరు మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు.


More Bhakti News