జాతకాన్ని మార్చిన రాఘవేంద్రుడు

ఒకసారి రాఘవేంద్రస్వామి ఆశ్రమానికి ఓ కుటుంబానికి చెందిన సభ్యులు వస్తారు. తమది పక్కనే గల గ్రామమని చెబుతారు. ఆ ఊరికి చెందిన అమ్మాయిని తమ కోడలిగా చేసుకుందామనే ఉద్దేశంతో, పెళ్లి చూపులకి వచ్చినట్టుగా చెబుతారు. అయితే పిల్ల జాతకం బాగోలేదనీ, ఆ అమ్మాయికి వైధవ్యం రాసి పెట్టి వుందని అంటారు.

అమ్మాయి బుద్ధిమంతురాలు కావడం వలన తమ కొడుకు ఎంతగా నచ్చచెబుతున్నా వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. తమ కొడుక్కి కాస్త అర్థమయ్యేలా చెప్పమని కోరతారు. ఆందోళన చెందవలసిన పనిలేదనీ, ఆ అమ్మాయిని కోడలిగా చేసుకోమని చెబుతాడు రాఘవేంద్ర స్వామి. దాంతో వాళ్లు కొంత సేపు తర్జనభర్జనపడినా, ఆయన పట్ల గల విశ్వాసంతో పెళ్లికి అంగీకరిస్తారు.

ఈ విషయం తెలిసిన ఆడపిల్ల వాళ్లు రాఘవేంద్రస్వామి దగ్గరికి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. జాతకంలో దోషం కారణంగా సంబంధాలన్నీ వెనక్కి పోతున్నాయనీ, ఆయన దయ వలన ఆ సంబంధం కుదిరిందని చెప్పివెళతారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ వుంటాయి. పెళ్లి కొడుకుతో ప్రత్యేకంగా చేయించవలసిన పూజ కోసం అతనికి కబురు చేస్తారు. ఆ ఇంటి గుమ్మం చిన్నదిగా ఉండటంతో, చూసుకోకుండా వచ్చిన పెళ్లి కొడుకు తలకి గుమ్మం పై భాగం తగులుతుంది.

అంతే బాధతో విలవిలలాడిపోతూ అక్కడే అతను ప్రాణాలు కోల్పోతాడు. ఈ విషయం తెలియడంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకుంటారు. అబ్బాయి తల్లిదండ్రులు రాఘవేంద్రస్వామి దగ్గరికి పరిగెత్తుకు వస్తారు. జరిగింది వివరించి ... ఆ అమ్మాయి జాతకం గురించి తాము ముందే చెప్పామంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. రాఘవేంద్ర స్వామి మౌనంగా ఆ శవం దగ్గరికి చేరుకుంటాడు. తన కమండలంలోని నీళ్లు ఆ శవం పై చల్లుతాడు.

అంతే నిద్రలో నుంచి మేల్కొనట్టుగా ఆ అబ్బాయి లేచి కూర్చుంటాడు. ఇక ఎలాంటి ఆటంకాలు రావనీ ... నిరభ్యంతరంగా వివాహం జరిపించమని చెప్పి వెనుదిరుగుతాడు రాఘవేంద్ర స్వామి. ఈ దృశ్యం చూసిన వాళ్లందరూ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తూ స్వామి పాదాలపై పడతారు.


More Bhakti News