అడిగినదిచ్చే అశ్వత్థ నారాయణుడు

మహాభారతం తెలిసినవారికి 'విదురుడు' గురించి తెలియకుండా వుండదు. విదుర నీతి ... ఆయన వ్యక్తిత్వం అందరిచే ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి విదురుడు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబిస్తాడు. శ్రీమహావిష్ణువును ధ్యానించి మోక్షాన్ని పొందాలని నిర్ణయించుకుంటాడు. అశ్వత్థ వృక్షాన్ని శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావించి, ఆ చెట్టు కొమ్మను ఒకచోట నాటుతాడు. అది మహావృక్షం అయ్యేంత వరకూ అక్కడే తపస్సు చేస్తాడు.

ఆయన తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆయన అభ్యర్థన మేరకు ఇక్కడ వెలిశాడు. విదురుడు కోరుకున్న మోక్షాన్ని అనుగ్రహించాడు. అలా స్వామివారు ఆవిర్భవించిన ఈ క్షేత్రం కర్ణాటక - చిక్ బళ్ళాపూర్ లో దర్శనమిస్తుంది. విదురుడు తపస్సు చేసిన ప్రాంతం కనుక, ఈ క్షేత్రానికి 'విదుర అశ్వత్థ క్షేత్రం' అనే పేరు వచ్చింది. ఇక్కడి ఆలయం ఆధ్యాత్మికత పరంగా ... చారిత్రక పరంగా ఆనాటి ఘనతను ఆవిష్కరిస్తూ వుంటుంది.

గర్భాలయంలో స్వామి దర్శనం అనంతరం, ప్రాంగణంలో గల రావిచెట్టును దర్శించుకుని భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు. ఈ క్షేత్రానికి ... సుబ్రహ్మణ్య స్వామికి ఏదో అవినాభావ సంబంధం వుందని అనిపిస్తూ వుంటుంది. కోరికలు నెరవేరిన భక్తులు, ఆలయ ప్రాంగణంలో సర్పరూపంలో గల సుబ్రహ్మణ్య స్వామి శిలా విగ్రహాలను వుంచుతుంటారు. ఆవరణ అంతటా ఇవే కనిపిస్తూ వుంటాయి.

ఈ సర్పరూప విగ్రహాలను బట్టి ఇక్కడి స్వామి భక్తులను ఏ స్థాయిలో అనుగ్రహిస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో శివాలయం ... ఆంజనేయ ఆలయం ... నవగ్రహ మంటపం కనిపిస్తూ వుంటాయి. ఇక్కడి స్వామిని దర్శించడం వలన కోరుకున్న వారికి కోరుకున్నవి లభిస్తాయని స్థలచరిత్ర చెబుతోంది.


More Bhakti News