పాపాలు నశింపజేసే పుష్కరాలు

బృహస్పతికి ... పన్నెండు రాశులకి ... పన్నెండు నదులకి మధ్య అవినాభావ సంబంధం కనిపిస్తుంది. బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు జీవనదులకు పుష్కరాలు వస్తుంటాయి . అలా పన్నెండు నదులు పుష్కరాలతో ప్రజలను పునీతం చేస్తుంటాయి. నదులలో స్నానం ఆచరించే వారి పాపాలను ప్రక్షాళన చేసే ఈ పుష్కరుడు ఎవరో కాదు, సాక్షాత్తు శివుడిని మెప్పించి ఆయన అష్ట రూపాలలోని జలరూపాన్ని పొందిన భక్తుడు.

మానవులు తెలిసీ తెలియక అనేక పాపాలను చేసి, వాటి ఫలితంగా అనేక కష్ట నష్టాలను అనుభవిస్తూ వుంటారు. అలాంటివారి పాపాలను కడిగివేసి, వారికి అవసరమైన పుణ్య ఫలాలను అందించడం కోసమే పుష్కరుడు అలా వరాన్నిపొందాడు. అంతే కాకుండా తన వలన సాధ్యమైనంత మేలు జరగాలనే ఉద్దేశంతో, బ్రహ్మ దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఆయన కమండలంలోను ... బ్రహస్పతి ఒక రాశి నుంచి మరో రాశికి మారుతున్నప్పుడు ఆయన వెంటే ఉంటానని మాట ఇచ్చాడు.

ఇక ఈ పుష్కర సమయంలో ప్రతి ఒక్కరూ నదిని భక్తి శ్రద్ధలతో పూజించాలని శాస్త్రం చెబుతోంది. నదీ తీరంలో గల నదీమ తల్లి విగ్రహాలను పసుపు కుంకుమలతో పూజించి, చీరసారెలను సమర్పించాలని అంటోంది. ఈ రోజుల్లో నదీ తీరంలో చేసే స్నానం ... జపం ... ధ్యానం ... దానం అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తాయని అంటోంది. ఇక ఈ రోజుల్లో పితృ తర్పణాలు వదలడం వలన వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News