పారిజాతం చెట్టుకింద వెలసిన గోపాలుడు

శ్రీమహా విష్ణువు ధరించిన దశావతారాలలో కృష్ణావతారానికి ఎంతో విశిష్టత వుంది. ధర్మాన్ని నడిపించడం కోసం ... ధర్మాన్ని గెలిపించడం కోసం ఆయన ఆవిష్కరించిన లీలా విశేషాలను గురించి ఎంతగా తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. అలాంటి శ్రీ కృష్ణుడు రుక్మిణీ సత్యభామ సమేతంగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలాంటి పవిత్రమైన క్షేత్రం నల్గొండ జిల్లా 'గోపలాయిపల్లి' లో దర్శనమిస్తుంది.

శ్రీ కృష్ణుడు ... రుక్మిణీ ... సత్యభామ మధ్య పారిజాత పుష్పం విషయంలో జరిగిన గొడవ, ఆ సమస్య పరిష్కారమైన తీరు ప్రతి ఒక్కరికి గుర్తుండి పోతుంది. అలాంటి పారిజాత చెట్టు కింద గల పుట్టలో నుంచి స్వామివారు బయటపడటం వలన ఈ క్షేత్రం మరింత మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఓ పశువుల కాపరి వలన ఇక్కడి స్వామి వెలుగులోకి వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడి కొండపై స్వామివారు స్వయంభువుగా దర్శనమిస్తూ వుంటాడు. కుదురైన రాజగోపురం ... తీర్చిదిద్దిన ముఖమంటపం ... ఆహ్లాదకరమైన వాతావరణం మనసును కట్టిపడేస్తుంటాయి. వారిజాల వేణుగోపాల స్వామిని దర్శించడం వలన అన్యోన్య దాంపత్యం ఏర్పడటమే కాకుండా, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇదే కొండపై పరమశివుడు కూడా నెలకొని వున్న కారణంగా ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా అలరారుతోంది.

ఇక ఆ పక్కనే సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్ట వుండటం విశేషం. ఈ పుట్ట మన్నుని నుదుటున ధరించిన వారికి చర్మవ్యాధులు నశిస్తాయని చెబుతుంటారు.ఇటు వైష్ణవ సంబంధమైన పండుగలు ... అటు శైవ సంబంధమైన పర్వదినాల్లో ఈ క్షేత్రం సందడిగా కనిపిస్తూ వుంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రం మానసిక ఆనందాన్ని మహా ప్రసాదంగా అందిస్తూ వుంటుంది. ఆహ్లాదంతో కూడిన ఆధ్యాత్మికతను అందించే ఈ అందమైన ఆలయాన్ని తప్పకుండా దర్శించితీరాలి.


More Bhakti News