పెరుమాళ్ అనుగ్రహం

శ్రీమహావిష్ణువు శయనమూర్తిగా దర్శనమిచ్చే అన్ని క్షేత్రాల్లోను, ఆయన ఆదిశేషుడిపై శయనిస్తూ కనిపిస్తూ వుంటాడు. అందుకు భిన్నంగా నేలపై శయనిస్తూ వుండే శ్రీ మహా విష్ణువు మహాబలిపురంలో కనిపిస్తాడు. ఈ కారణంగానే ఇక్కడి శ్రీ మహా విష్ణువును 'స్థలశయన పెరుమాళ్' గా పిలుస్తూ వుంటారు.

ఒకానొక సమయంలో ఇంతటి అరుదైన విగ్రహం చెయ్యి విరిగిపోయిందట. ఆ విషయం తెలుసుకున్న 'దండి' అనే మహాకవి, విరిగిన స్వామివారి చెయ్యిని తాను అతికిస్తాననీ ... అందుకు అవకాశం ఇవ్వమని నిర్వాహాకులను కోరాడు. ఇది మహాకవులు చేసే పని కాదుగదా అనుకుంటూనే, ఆయనపై గల గౌరవంతో అందుకు వాళ్లు అంగీకారాన్ని తెలియజేశారు. స్థల శయన పెరుమాళ్ కు 'దండి' మనస్పూర్తిగా నమస్కరించి, ఆయన అనుగ్రహమే వుంటే ఆ విగ్రహం చెయ్యిని ఎప్పటిలా ఉంచుతాననుకుంటూ రంగంలోకి దిగాడు.

కొన్ని గంటలపాటు శ్రమపడి స్వామివారి విగ్రహపు చేతిని అతికించి బయటికి వచ్చాడు. అయితే ఈ విషయం ఓ మహా శిల్పకారుడికి తెలిసింది. తాను వుండగా కవితో స్వామివారి చేతిని అతుకు పెట్టించడం సరి కాదంటూ ఆయన ఆలయానికి చేరుకున్నాడు. శిల్ప శాస్త్రం తెలియని దండితో ఆ పనిని చేయించడాన్ని ఆయన తప్పుబట్టాడు. స్వామివారి విగ్రహంలో ఏ చెయ్యి ఎక్కడ విరిగిందో నిజానికి తనకి తెలియదనీ, దండికి శిల్ప శాస్త్రం తెలియదు కాబట్టి ఆయన పెట్టిన అతుకుని తాను ఇట్టే పట్టేస్తానంటూ అందరితోను చెప్పాడు.

అందుకు అవకాశం ఇవ్వడంతో ఆయన స్వామివారి విగ్రహానికి గల చేతులను పరిశీలించి చూశాడు. కానీ అతుకు ఎక్కడ వుందో తెలుసుకోలేకపోయాడు. ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోవడంతో ఆశ్చర్యపోయాడు. ఓ మహా కవి ... ఓ మహా శిల్పి కూడా కనుక్కోలేని విధంగా స్వామి వారి చేతిని అతికించడం మహిమాన్వితమైన సంఘటనగా పేర్కొన్నాడు. పెరుమాళ్ పట్ల దండికి గల భక్తి శ్రద్ధలకు ఇంతకి మించిన నిదర్శనం లేదని స్పష్టం చేశాడు. దండిని తక్కువ చేసి మాట్లాడినందుకు మన్నించమంటూ వేడుకున్నాడు.


More Bhakti News