బాలికగా వెలసిన అమ్మవారు

చిత్తూరు జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాలు అలరారుతున్నాయి. వైష్ణవ .. శైవ .. శాక్తేయ క్షేత్రాలు అశేష భక్త జనకోటిచే నిత్యం సందడిగా కనిపిస్తుంటాయి. ఇక ఈ ప్రాంతంలో శక్తి క్షేత్రాలతో సమానంగా గ్రామదేవతల ఆలయాలు కూడా విలసిల్లుతున్నాయి. అలాంటి గ్రామదేవతలలో ఇక్కడ ముందువరుసలో నిలుస్తోంది 'శ్రీ పొన్నియమ్మ'.

చిత్తూరులో ఆవిర్భవించిన ఈ అమ్మవారిని ఇక్కడి ప్రజలు తమ ఇలవేల్పుగా భావించి నిత్యపూజలు నిర్వహిస్తుంటారు. అమ్మవారు ఇక్కడ వెలసిన విధానం కూడా ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటుంది. పూర్వం ఈ ప్రాంతం పాలెగాళ్ల ఏలుబడిలో వుండేది. వాళ్ల మాట వేదంగా ... వాళ్లు చేసినది శాసనంగా చెలామణి అవుతూ వుండేది. దాంతో వాళ్ల వలన ఇక్కడి ప్రజలు నానాఅవస్థలు పడసాగారు.

తమని వాళ్ల బారినుంచి కాపాడమని అంతా కలిసి అమ్మవారిని ప్రార్ధించగా, అమ్మవారు పదహారేళ్ల వయసుగల బాలికగా ఈ గ్రామానికి వచ్చిందట. పాలెగాళ్ల బారి నుంచి ప్రజలను కాపాడి ఇక్కడ వెలిసిందట. బాలిక రూపంలో రావడం వలన ఇక్కడ అమ్మవారిని 'పొన్నియమ్మ' గా పిలుస్తుంటారు. చక్కగా తీర్చిదిద్దబడిన ముఖ మంటపంలోకి అడుగుపెడితే, వివిధ రూపాల్లో రూపొందించిన అమ్మవారి ప్రతిమలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. పసుపు అద్దిన మోముతో ... విశాల నేత్రాలతో ... సర్వాభరణాలతో గర్భాలయంలోని అమ్మవారు కళకళలాడుతూ దర్శనమిస్తుంది.

ఇదే ప్రాంగణంలో గణపతి ... శ్రీ వల్లీ - దేవసేన సమేత కుమారస్వామి ... నాగదేవత ... హనుమంతుడు పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆమె అనుగ్రహం కారణంగానే పాడిపంటలు అభివృద్ధి చెందుతాయని అంటారు. అందుకే తమకి ఏ లోటూ లేకుండా చూసే ఆ తల్లికి, తాము ఎలాంటి లోటూ రానీయకుండా చూసుకుంటూ వుంటారు.


More Bhakti News