పరశురాముడి కోరిక

జమదగ్ని మహర్షి శాప ఫలితంగా కుష్ఠువ్యాధిగ్రస్తురాలైన రేణుకాదేవి, శివుడి అనుగ్రహంతో పూర్వరూపాన్ని పొందుతుంది. తన భర్తను కలుసుకోవాలనే ఆరాటంతో ఆమె నేరుగా ఆయన ఆశ్రమానికి వస్తుంది. ఆమెని చూడగానే మహర్షి తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. వెంటనే ఆశ్రమం విడిచి పోవలసిందిగా ఆదేశిస్తాడు. తాను ఎక్కడికీ వెళ్లననీ ... మరణమైనా అది ఆయన పాదాల చెంతనే జరగాలని చెబుతుంది రేణుకాదేవి.

దాంతో జమదగ్ని తన కుమారుల్లో ముగ్గురిని పిలిచి ఆమెని సంహరించమని ఆదేశిస్తాడు. అందుకు వాళ్లు అంగీకరించక పోవడంతో అక్కడే వారిని భస్మం చేస్తాడు. ఆ తరువాత పరశురాముడిని పిలిచి రేణుకాదేవిని సంహరించమని చెబుతాడు. తల్లి పాదాలకి నమస్కరించిన పరశురాముడు ఆమె తలను నరికేస్తాడు. తండ్రి ఆజ్ఞను శిరసా వహించిన పరశురాముడిని జమదగ్ని అభినందిస్తాడు. ఈ సందర్భంగా మూడు వరాలను కోరుకోమని పరశురాముడిని అడుగుతాడు.

తపోబల సంపన్నుడైన తన తండ్రికి ఆవేశం అధికంగా వుండటం వల్లనే అనర్థాలు జరుగుతున్నాయని గ్రహించిన పరశురాముడు, మొదటివరంగా కోపాన్ని వదులుకోవలసిందిగా తండ్రిని కోరతాడు. అందుకు జమదగ్ని అంగీకరించడంతో, రెండవ వరంగా తన సోదరులను బతికించమని అడుగుతాడు. ఇక మూడవ వరంగా తన తల్లిని బతికించమని కోరతాడు. తల్లిపాలు తాగిన రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని కల్పించమని అడుగుతాడు.

దాంతో తన కమండలంలోని పవిత్ర జలాన్ని రేణుకాదేవి దేహంపై చల్లుతాడు జమదగ్ని. ఫలితంగా రేణుకాదేవి పునర్జీవితురాలై భర్త పాదపద్మాలను కళ్లకు అద్దుకుంటుంది. తన కుమారుల చెంత ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వారికి ఆశీస్సులు అందజేస్తుంది. రేణుకాదేవి ఆశ్రమానికి దూరం కావడం వలన బాధపడిన వాళ్లంతా, ఆమె తిరిగి రావడంతో సంతోషంతో పొంగిపోతారు.


More Bhakti News