పుట్టమన్ను శివుడు

ప్రాచీన శైవ క్షేత్రాలను పరిశీలించినప్పుడు కొన్ని క్షేత్రాల్లోని గర్భాలయాల్లో మట్టితోను ... ఇసుకతోను చేసిన శివలింగాలు కనిపిస్తుంటాయి. ముహూర్త సమయానికి శివలింగం రాకపోవడం వలన గోధుమపిండితో చేసిన లింగాలను పానవట్టంలో అమర్చిన సందర్భాలు లేకపోలేదు. మట్టితో ... ఇసుకతో చేసిన శివలింగాలను కొన్ని క్షేత్రాల్లో చూస్తుంటాం. కానీ పుట్టమన్నుతో చేసిన శివరూపాన్ని మాత్రం వరంగల్ జిల్లా 'కొమరవెల్లి'లో మాత్రమే చూస్తాం.

పుట్టమన్నుతో చేయబడిన స్వామి వారి ప్రతిమ నిన్నటిదో ... మొన్నటిదో అనుకుంటే పొరపాటే. కాకతీయ ప్రభువుల కాలం నుంచి ఈ పుట్టమన్ను శివుడికి పూజలు నిర్వహిస్తున్నారు. విశాలమైన నేత్రాలతో ... సన్నని మీసకట్టుతో ... నాగాభరణం గల కిరీటంతో దర్శనమిచ్చే స్వామివారిని భక్తులు మల్లికార్జునుడుగా పిలుచుకుంటూ వుంటారు. వీరశైవ ఆగమ పద్ధతిలో పూజించుకుంటూ వుంటారు.

ఇక గుహ లాంటి ప్రదేశంలో పుట్టమన్నుతో ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహం నాటి నుంచి నేటి వరకూ చెక్కుచెదరక పోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది. సాధారణంగా పుట్టలకు కాస్త తేమ తగలగానే అవి తరిగిపోతాయి. ఇక పుట్టమన్నుతో చేసిన బొమ్మలు ఏవైనా కొంతకాలానికి పెచ్చులు రాలిపోయి ఆకారాన్ని కోల్పోతాయి.

కానీ కొన్ని వందల సంవత్సరాలు గడుస్తున్నా ఈ విగ్రహానికి ఇంతవరకూ అలాంటి పరిస్థితి రాలేదు. ఇకపై కూడా రాదని స్థానికులు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక్కడి మల్లికార్జునుడి ప్రతిమ ఇంతటి మహిమాన్వితమైనదిగా కనిపించడానికి కారణం, ఈ ప్రతిమ నాభిభాగం వరకూ స్వయంభువు శివలింగం కొలువై ఉండటమేననే ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తుంటుంది.


More Bhakti News