కదళీవన ధ్యానం

సాధారణంగా వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడగల పచ్చని ప్రకృతి ... ప్రశాంతమైన వాతావరణం మనసును కట్టిపడేస్తుంటాయి. గతంలో అక్కడి కొండలపై ... గుహల్లోనూ యోగులు తపస్సు చేసుకున్నారని తెలిసినప్పుడు ఒకరకమైన అనుభూతి కలుగుతుంది. ఎలాంటి సదుపాయాలూ లేని ఆ రోజుల్లో వాళ్లు అక్కడ ఎలా ఉండగలిగారనే ఆలోచనే మనసును తొలిచేస్తూ వుంటుంది. చీకటి పడితే పరిస్థితి ఏమిటని తలచుకోగానే వంట్లో వణుకు మొదలవుతుంది.

అచ్చు ఇలాంటి అనుభూతి 'కదళీవనం' దర్శించినప్పుడు కలుగుతుంది. ఇది శ్రీశైల క్షేత్రంలో చెప్పుకోదగిన తపోభూమిగా అలరారుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అరటిచెట్లతో నిండిపోయి ఉండటం వలన, ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అంటారు. శ్రీశైల క్షేత్రంలో తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా కదళీవనం గురించి చెబుతుంటారు. ఎందరో మహర్షులు ... యోగులు ... సిద్ధులు ... ఈ ప్రదేశంలో ధ్యానం - తపస్సు చేసుకునేవారని స్థలపురాణం చెబుతోంది.

ప్రకృతి మాత ప్రశాంత వదనంతో అందించే స్వచ్ఛమైన నీళ్లు, ఆకలికి అంకితం చేయబడినట్లుగా కనిపించే ఫలాలు, ఆవాసానికి అనుకూలంగా మలచబడిన గుహలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఎలాంటి వైపరిత్యాలు ఎటువంటి ప్రభావం చూపించలేని ఈ పవిత్ర ప్రదేశాన్ని చూస్తే, ఇక్కడ మహర్షుల ... యోగుల ... సిద్ధుల తపస్సుకి భంగం కలగకుండా భగవంతుడే అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టుగా అనిపిస్తూ వుంటుంది.

ప్రాణం నిలవడానికి అవసరమైనంత నీరు .. ఆహారం మాత్రమే తీసుకుంటూ యోగులు ఇక్కడ తమ తపస్సును కొనసాగించే వారు. ఎంతోమంది సిద్ధులు తమకి నచ్చిన మార్గంలో ఇక్కడ సాధనలు చేసినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. వాళ్లలో చాలామంది తమ తపోశక్తిని సమాజ శ్రేయస్సుకి వినియోగించడం విశేషం


More Bhakti News