అందరినీ ఆదరించే సన్నిధానం

జీవితంలో ఎన్నో సమస్యలు ... కష్టాలు ఎదురౌతున్నప్పటికీ, ఆ బాధలను తట్టుకుంటూనే భగవంతుడు నిర్దేశించిన మార్గంలోకి అడుగుపెట్టిన మహానుభావుడు శ్రీ రాఘవేంద్రస్వామి. ప్రశాంతతయే అలంకారంగా ... సున్నితమైన మాటతీరే ఆయుధంగా ప్రజలను ఆధ్యాత్మిక పథంలో నడిపించడానికి ఆయన తనవంతు కృషిచేశాడు.

శంఖ చూడునిగా .. ప్రహ్లాదుడిగా ... వ్యాస తీర్థులుగా అవతరించిన స్వామియే రాఘవేంద్రస్వామిగా అవతరించాడని ఆయన జీవితాన్ని పరిశీలించడం వలన తెలుస్తోంది. శ్రీ రాఘవేంద్రుల వారి దృష్టి మహా శక్తిమంతమైనది. తన దగ్గరికి వచ్చేవారి సమస్య ఏమిటనేది ముందుగానే ఆయనకి తెలిసిపోతూ వుండేది. నిరంతరం మూలరాముడిని సేవిస్తూ వుండటం వలన ఆయన పిలిస్తే హనుమంతుడు పలుకుతాడని చెబుతుంటారు.

అందువల్లనే దుష్ట ప్రయోగాల వలన బాధలు పడుతున్న వారు, ఆయన కొలువైన క్షేత్రాలకు వస్తుంటారు. ఆరోగ్యాన్ని ... మానసిక ప్రశాంతతను పొందుతూ వుంటారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా గద్వాల లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం కూడా మనకి కనిపిస్తూ వుంటుంది. కుదురుగా తీర్చిదిద్దబడిన ఆలయం మానసికపరమైన ఆహ్లాదాన్ని అందిస్తుంది. గర్భాలయంలో స్వామి 'బృందావనం' రూపంలో దర్శనమిస్తూ వుంటాడు.

ప్రతి గురువారం స్వామివారిని దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారి సేవలో పాల్గొంటూ తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటూ సంతృప్తిని పొందుతూ వుంటారు. ఈ సందర్భంగా చిన్న రథంలో ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి సేవ జరుగుతుంది. అయితే దీనిని పల్లకీసేవగానే ప్రస్తావిస్తుంటారు. రధంపై గల రాఘవేంద్ర స్వామిని దర్శించడం వలన సమస్త దుఃఖాలు నశించి సకల శుభాలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News