బంగారునాణాల తులాభారం

శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలం స్వర్ణయుగంగా పేర్కొనబడింది. సంగీత .. సాహిత్య .. నాట్య .. శిల్పకళలు ఆయన ఏలుబడిలో అద్భుతంగా ఆవిష్కరించబడ్డాయి. మంచితనం ... మానవత్వం మూర్తీభవించిన శ్రీకృష్ణ దేవరాయలు, ఆధ్యాత్మిక వైభవానికి తన వంతు కృషి చేశాడు. ఈ కారణంగానే ఆయా క్షేత్రాల్లో ఆయన పేరు వినిపిస్తూ వుంటుంది. అలాంటి క్షేత్రాల్లో 'హంపి' ఒకటిగా చెప్పుకోవచ్చు.

దూరం నుంచి హంపిని చూస్తే బండరాళ్ల గుట్టలు కనిపిస్తాయి ... ఆ రాళ్లతో నిర్మించబడిన శిధిల గోపురాలు కనిపిస్తాయి ... మౌనంగా ఒరిగిపోయిన మంటపాలు కనిపిస్తాయి. అదే కళాదృష్టితో చూస్తే అక్కడున్న ప్రతి రాయి మహోన్నతమైన చరిత్రను మనకి అందించడం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తోన్న మహర్షిలా కనిపిస్తుంది. అడుగుతీసి అడుగువేస్తే ప్రతిరాయి ఓ అమ్మలా ఆప్యాయంగా పలకరిస్తూ వుంటుంది. ఆనాటి చారిత్రక వైభవాన్ని అనర్గళంగా చెబుతూనే వుంటుంది.

ఈ నేపథ్యంలోనే మనకి 'తులాభారం' గురించిన ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. ఎదురెదురుగా నిలబెట్టిన రెండు పొడవైన స్తంభాలు ... ఆ రెండింటిని పైభాగాన కలుపుతూ అడ్డంగా వుండే మరో స్తంభం ... దీనినే తులాభారం అంటారు. చూడటానికి ఇప్పుడిది పెద్ద గొప్పగా కనిపించకపోయినా, ఎందరో విదేశీ రాయబారులు దీని గురించి తమ గ్రంధాలలో గొప్పగా రాసుకున్నారు.

శ్రీ కృష్ణ దేవరాయలు తన ప్రతి పుట్టిన రోజున ఇక్కడ బంగారు నాణాలతో తులాభారం తూగి, ఆ నాణాలను అక్కడే అప్పుడే పేదలకి పంచిపెట్టేవాడట. అప్పట్లో ఈ వేడుక ఓ పండుగలా జరిగేదని శాసనాలు చెబుతున్నాయి. బంగారు ఆభరణాలు దానం చేసిన కృష్ణదేవరాయలు లేడు ... వాటిని స్వీకరించిన పేద ప్రజలు లేరు. కానీ ఆ తులాభార మంటపం మాత్రం అలనాటి వైభవానికి అద్దంలా నిలిచి కనిపిస్తూ వుంటుంది. మనల్ని కృష్ణదేవరాయల కాలంలో విహరింపజేస్తూ వుంటుంది.


More Bhakti News