ఆదుకునే అయ్యప్ప

కార్తీకమాసం మొదలైన దగ్గర నుంచి మకర సంక్రాంతి వరకూ కూడా ఎక్కడ చూసినా అయ్యప్ప దేవాలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తుంటాయి. అయ్యప్పస్వామి దీక్ష తీసుకోవడం తేలిక, కానీ మాలధారణ చేసిన దగ్గర నుంచి నియమాలను పాటించడం ... స్వామి దర్శనానికి శబరిమల వెళ్లి రావడం కష్టతరమైన విషయం. అయితే కష్టాల నుంచి ఆ స్వామి గట్టెక్కిస్తాడనే బలమైన విశ్వాసంతోనే భక్తులు మాలధారణ చేస్తుంటారు ... మనసును ఆయన పాదాల చెంత సమర్పిస్తుంటారు.

అయ్యప్పస్వామి దీక్ష తీసుకున్నాక శబరిమల యాత్రకు బయలుదేరడానికి ముందు 'ఇరుముడులు' కట్టడం వుంటుంది. మండలంపాటు స్వామి భజనలు చేసుకోవడానికి ... ఆ తరువాత ఇరుముడులు కట్టుకోవడానికి భక్తులు తమ ప్రాంతాల్లో అయ్యప్పస్వామి ఆలయాలు నిర్మించుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండకి చెందిన అయ్యప్పస్వామి ఆలయం కూడా ఈ జాబితాలోనే కనిపిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో ... ప్రశాంతమైన వాతావరణంలో ... ఆధునిక నగిషీలతో ఈ ఆలయం మనోహరంగా దర్శనమిస్తూ వుంటుంది. గర్భాలయ ముఖద్వారానికి ముందు 18 మెట్లు ఏర్పాటు చేయబడగా గర్భాలయంలో వేదికపై అయ్యప్పస్వామి పంచలోహ మూర్తిగా దర్శనమిస్తుంటాడు. దీపకాంతుల మధ్య దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయే స్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

మాలధారణ జరిగే ఈ రోజుల్లో భక్తుల సందడి ఎక్కువగా వుంటుంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన ఆపదలు తొలగిపోతాయనీ, ఆనందాలు చేరువౌతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో కొలువుదీరిన వినాయకుడు .. సుబ్రహ్మణ్య స్వామి .. నాగేంద్ర స్వామి .. ఆంజనేయస్వామి కొలువైవున్న కారణంగా ఈ ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంలా విలసిల్లుతూ వుంటుంది.


More Bhakti News