శ్రీ కంఠ మల్లేశ్వరుడు

పరమశివుడి లీలా విశేషాలను అర్థం చేసుకోవడం మహర్షుల వల్లనే కానీ, సాధారణ మానవుల వలన కాదు. అనంతమైన ఆయన మాయలో భాగంగానే ఆయా పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించాయి ... అపారమైన భక్తజనకోటిచే నిత్య నీరాజనాలు అందుకుంటున్నాయి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా 'నంజన్ గూడ్' దర్శనమిస్తుంది.

కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ పుణ్యక్షేత్రం ఇటు చారిత్రక నేపథ్యాన్ని ... అటు పురాణపరమైన విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆలయ నిర్మాణ శైలి ఆనాటి శిల్పకళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తూ వుంటుంది. గాలిగోపురం ... ప్రాకారాలు ... మంటపాలు ... పరివార దేవతలు ... నయనారుల మందిరాలు ఆనాటి భారీతనానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి.

ఎంతోమంది రాజులు ఇక్కడి స్వామివారిని దర్శించుకుని, కానుకలు సమర్పించుకున్నారు. మరికొందరు రాజులు స్వామిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తూ, ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. అడుగడుగునా ఉట్టిపడే ఆలయ సౌందర్యం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంటుంది. నాటి రాజుల నుంచి నేటి సామాన్యుల వరకూ, అందరికీ కూడా స్వామివారి మహిమలు అనుభవంలోకి వచ్చాయి.

ఇక్కడి స్వామిని పూజించడం వలన ఆపదలు ... అనారోగ్యాలు ఇట్టే మాయమైపోతాయని చెబుతుంటారు. ప్రతియేటా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక ఈ సందర్భంగా జరిగే 'రథోత్సవం' కన్నుల పండువగా వుంటుంది. వేలాదిమంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని మొక్కుబడులు చెల్లిస్తూ వుంటారు ... నిరంతరం నీలకంఠ స్వామివారి సేవలో తరిస్తూవుంటారు.


More Bhakti News