పువ్వొత్తి ప్రత్యేకత

దేవుడెవారైనా పూజ అనేది దీపారాధనతోనే మొదలవుతుంది. పూజ పూర్తి చేయడం వలన వచ్చే పుణ్యంలో సగభాగం దీపారాధన వల్లనే లభిస్తుంది. అందువల్లనే కార్తీక మాసంలో దీపారాధనకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. కార్తీక మాసంలో దేవాలయాల్లో వెలిగించే దీపాలకు ... పౌర్ణమి రోజున అరటి దోప్పల్లో వెలిగించే దీపాలకు ... ఆ తరువాత వచ్చే ధనుర్మాస పూజలకు సైతం చాలా మంది 'పువ్వొత్తులు' ఉపయోగిస్తూ వుంటారు.

పీఠభాగం పువ్వులా వుండి .. వత్తి భాగం కాడలా వుంటుంది కనుక దీనిని పువ్వొత్తి అని పిలుస్తూ వుంటారు. పీఠ భాగం గుండ్రంగా వుండి మధ్య భాగంలో వత్తి వుంటుంది కనుక కొన్ని ప్రాంతాల్లో వీటిని 'బొడ్డు వత్తులు' అని కూడా అంటారు. సాధారణ రోజులలో మామూలు వత్తులతో పూజించే వాళ్లు, విశేషమైన పుణ్య తిథుల్లో మాత్రం పువ్వొత్తులనే వాడుతుంటారు. విశేషమైన రోజుల్లో ఈ వత్తులను వెలిగించడం వలన అధిక ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు.

నిజానికి మామూలు వత్తికంటే పువ్వొత్తి ఎక్కువ సేపు వెలుగుతుంది. మామూలు వత్తులు సగం వెలిగి మధ్యలో ఆరిపోయే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కానీ పువ్వొత్తి చివరి వరకూ ఆగకుండా ... ఆరిపోకుండా మరింత కాంతివంతంగా వెలుగుతుంది. ఇక మామూలు వత్తులు రెండేసి చేసి వెలిగించ వలసి వుంటుంది. పువ్వొత్తి అయితే పువ్వు .. వత్తి రెండు భాగాలుగా భావించి ఒకదానినే వెలిగించడం జరుగుతుంటుంది.

పువ్వొత్తిలో వత్తి నిటారుగా వుండటం వలన జ్యోతి స్వరూపుడైన పరమాత్ముడిని ఈ దీపం పరిపూర్ణంగా ఆవిష్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి దీపం పూజ పూర్తి కాకుండా కొండెక్కకూడదు కనుక, ఎక్కువ సేపు వెలగాలనే ఉద్దేశంతోనే పువ్వొత్తులను ఉపయోగిస్తూ వుంటారు. వీటి ప్రత్యేకతను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే పెద్దలు ఈ నియమం చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News