దేవతల ఆశ్చర్యం

అనసూయాదేవి ఆశ్రమానికి సమీపంలో గల గ్రామంలో నర్మద అనే యువతి వుండేది. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్లు సైతం ఆమె అందచందాల గురించే చెప్పుకుంటూ ఉండేవాళ్లు. దాంతో సహజంగానే ఆమెలో అహంభావం కలుగుతుంది. ఆమెకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో జాతకం చూపిస్తాడు తండ్రి. నర్మదకి అయిదవతనం రాసి పెట్టిలేదనీ, ఆమెను ఎవరు వివాహమాడినా మృత్యువు బారిన పడతారని జ్యోతిష్కులు చెబుతారు.

ఈ విషయం తెలుసుకున్న నర్మదలో అహంభావం మబ్బుతెరల్లా తొలగిపోతుంది. ఊళ్లో వాళ్ల మాటలు ఆమెకి మరింత బాధ కలిగిస్తుంటాయి. మహా పతివ్రత అయిన అనసూయాదేవిని ఆ ఊళ్లో అంతా గౌరవిస్తూ ఉండటాన్ని సహించలేకపోయిన శివానందుడు, ఈ విషయాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటాడు. అనసూయాదేవి దగ్గర ఎలాంటి శక్తులు లేవని నిరూపించాలని అనుకుంటాడు.

నర్మదను కలుసుకుని ఆమెను ఓదార్చుతున్నట్టుగా నటిస్తాడు. భూలోకంలో ఇలా అవమానాలు భరిస్తూ బతకడం కన్నా స్వర్గానికి వెళితే సుఖసంతోషాలతో ఉండవచ్చని చెబుతాడు. అనసూయాదేవిని ఆశ్రయిస్తే సశరీరంగా స్వర్గానికి పంపిస్తుందని చెబుతాడు. దాంతో నర్మద నేరుగా అనసూయాదేవి దగ్గరికి వెళ్లి తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. తనని స్వర్గానికి పంపించమంటూ పట్టుపడుతుంది. స్త్రీకి భర్త సేవకి మించిన స్వర్గం లేదని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది అనసూయాదేవి.

అదే సమయంలో ఊళ్లో జనాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు శివానందం. అనసూయాదేవికి ఎలాంటి శక్తులు లేవు గనుకనే, నర్మదకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుందని అందరితో చెబుతాడు. ఇటు నర్మదకు ... అటు శివానందానికి నిజానిజాలు తెలియజెప్పాలని నిర్ణయించుకుంటుంది అనసూయాదేవి. ఆమె ధ్యానంలోకి వెళ్లిన కొంతసేపటికే నర్మద సశరీరంగా స్వర్గానికి వెళుతుంది. శివానందుడితో పాటు ఈ దృశ్యం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు. హఠాత్తుగా మానవ లోకం నుంచి ఒక స్త్రీ రావడం చూసి దేవతలు బిత్తరపోతారు. అనసూయాదేవి తన పాతివ్రత్య మహిమతో ఆమెను సశరీరంగా స్వర్గానికి పంపించిందని తెలుసుకుని ఆశ్చర్యపోతారు.


More Bhakti News