కాలభైరవ అష్టమి విశిష్టత

కాలభైరవుడు అనే పేరులోనే అనంతమైన శక్తి దాగివున్నట్లు అనిపిస్తూ వుంటుంది. ఆయన ప్రతిమలు కూడా కాలాన్ని శాసిస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఆయన రూపం భయంకరంగా కనిపించినా, తనని ఆరాధించిన వారిపట్ల ఆయన రక్షకుడిగా వ్యవహరిస్తూ వుంటాడు. సాధారణంగా కాలభైరవుడి గురించి తెలియని వాళ్లు ఆయనకి కాస్త దూరంగా వుంటారు. నిజానికి ఆయన మహశివుడి మరో రూపంగానే చెప్పాలి. సమస్త ప్రాణులను పరమశివుడు ... భైరవుడి రూపంలోనే తనలో 'లయం' చేసుకుంటూ వుంటాడు.

భైరవుడి వాహనం పేరు 'కాలము' అనే కుక్క. ఈ కారణంగానే ఆయనని అంతా కాలభైరవుడిగా పిలుస్తూ వుంటారు. ఇక శివుడికి 'కాలుడు' అనే పేరు కూడా వుంది. కాలుడి నుంచి ఉద్భవించిన భైరవుడు కనుక కాలభైరవుడుగా ప్రసిద్ధి చెందాడు. నుదుటున విభూతి రేఖలు ధరించి ... నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకుని కనిపిస్తాడు. గద .. త్రిశూలం .. సర్పం .. పాత్ర చేతబట్టి దర్శనమిస్తుంటాడు. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ వుంటుంది.

కాలభైరవుడికి ప్రత్యేక ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా శైవ పుణ్య క్షేత్రాల్లో క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడు కనిపిస్తూ వుంటాడు.ముఖ్యంగా తూర్పు చాళుక్యులు నిర్మించిన శివాలయాల్లో క్షేత్ర పాలకుడిగా కాలభైరవుడే దర్శనమిస్తుంటాడు. కాలభైరవ రూపాలు అనేకంగా ఉన్నప్పటికీ వారిలో అష్టభైరవులను విశిష్ఠమైన వారిగా చెబుతుంటారు.

'అరసవిల్లి' వంటి పుణ్య క్షేత్రాల్లో ముందుగా కాలభైరవుడిని దర్శించిన తరువాతనే ప్రధాన దైవాన్ని దర్శిస్తూ వుంటారు. అంతటి శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన(మార్గశిర బహుళ అష్టమి) రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు.

ఆలయంలో పూజను పూర్తిచేసి గంట ధ్వని చేస్తూ శంఖం పూరిస్తారు. భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం ... తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. ఇక కొంతమంది ఇదే రోజున పితృకార్యాలను కూడా నిర్వహిస్తుంటారు. కాలభైరవుడి ఆగ్రహానికి దూరంగా ... ఆయన అనుగ్రహానికి దగ్గరగా వుండటం వలన విష బాధలు ... అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News