రెండు గర్భాలయాల దేవుడు

సాధారణంగా మారుమూల ప్రాంతంలోని ఆలయాల నుంచి మహా పుణ్యక్షేత్రాల వరకూ ఏ దేవుడికైనా ఒకటే గర్భాలయం వుంటుంది. అ గర్భాలయంలోని మూర్తి ప్రధానదైవమైన 'ధృవమూర్తి'గా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటుంది. దేవుడొక్కడే అన్నట్టుగా ఆయనకి గర్భాలయం కూడా ఒక్కటేనని బలంగా విశ్వసిస్తోన్న సమయంలో, ఒకే దేవుడిని రెండు గర్భాలయాల్లో దర్శించుకోవలసి వస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది.

అలాంటి అరుదైన క్షేత్రం నల్గొండ జిల్లా 'కేతేపల్లి' లో కనిపిస్తుంది. ఇక్కడి కొండపై గల గుహలో సీతా సమేతంగా ... లక్ష్మణ - హనుమ సహితంగా కోదండరాముడు కొలువుదీరి కనిపిస్తుంటాడు. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం 17 వ శతాబ్దంలో వైభవంతో వెలుగొందినట్టుగా చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి.

ఎందరో మహర్షులు ... మహారాజులు ... సంస్థానాధీశులు ఇక్కడి స్వామివారిని దర్శించి సేవించారు. స్వామివారి నిత్యపూజల నిమిత్తం వందలాది ఎకరాలను కానుకలుగా సమర్పించుకున్నారు. ఇక ఈ కొండపై గల కోనేరు వర్షాకాలంలో పూర్తిగా నిండటం వలన ఆ నీరు గుహలోకి చేరుకొని, స్వామివారి పాదాలను స్పర్శించి తరిస్తుంటుంది.

ఈ సమయంలో స్వామివారికి నిత్యపూజలు నిర్వహించడం కష్టంగా ఉండటంతో, కొండ పాదభాగాన గల 'చందుపట్ల' గ్రామంలో స్వామివారికి మరో ఆలయాన్ని నిర్మించారు. వర్షాకాలంలో ఇక్కడే స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. ప్రతియేటా స్వామివారికి 'చైత్రశుద్ధ పంచమి' నుంచి పదిరోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో ఉత్సవ మూర్తులు చందుపట్ల నుంచి కొండపైకి ఊరేగింపుగా తీసుకువెళతారు.

ఈ ఉత్సవాల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇక్కడి రాముడు అడిగినదే తడవుగా వరాలను ప్రసాదిస్తాడని స్థానికులు చెబుతుంటారు. ఇటు ఆధ్యాత్మికత పరంగాను ... అటు చారిత్రక పరంగాను ఎంతో విశిష్టత కలిగిన ఈ క్షేత్రాన్ని దర్శించడం, మరిచిపోలేని ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News