జలవీరభద్రస్వామి విశిష్టత

వీరభద్రుడు అనే పేరే పౌరుష పరాక్రమాలకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. వీరభద్రుడు అనగానే ఆగ్రహావేశాలను ఆవిష్కరించే విశాల నేత్రాలతో ... కోరమీసాలతో ... శత్రువులను సంహరించడానికి ఆయుధాలను ధరించి సిద్ధంగా వున్న భయానక రూపం కనులముందు కదలాడుతూ వుంటుంది. రుద్రాంశ సంభూతుడిగా అవతరించి, శివాదేశం మేరకు దక్ష యజ్ఞ ధ్వంసం చేసిన వీరభద్రుడు, మహర్షుల కోరికమేరకు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు.

అయితే శివాంశ సంభూతుడైన వీరభద్రుడు, లింగ రూపంలో ఆవిర్భవించిన క్షేత్రాలు చాలా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన క్షేత్రం మెదక్ జిల్లా 'దుద్దెడ' గ్రామంలో కనిపిస్తుంది. ఇక్కడ వీరభద్రస్వామి ... లింగరూపంలో పూజలు అందుకుంటూ వుంటాడు. ప్రతి సోమవారంతో పాటు విశేషమైన పుణ్య తిథుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. పూర్వం ఈ ప్రదేశంలో స్వామి దర్శనార్థం మహర్షులు తపస్సు చేశారనీ, వారి అభ్యర్ధనమేరకే స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతుంటారు.

ప్రాచీనకాలం నాటి ఈ ప్రదేశాన్ని ఎందరో మహనీయులు దర్శించి స్వామిని సేవించారు. చారిత్రక నేపథ్యం ... ఆధ్యాత్మిక వైభవంగల ఈ క్షేత్రం, అడుగడుగునా పవిత్రతను ప్రతిబింబిస్తూ వుంటుంది. గర్భాలయంలోని స్వామివారి లింగరూపం నుంచి అదే పనిగా 'జల' ఊరుతూ వుంటుంది. అందువలన ఇక్కడి స్వామిని జలవీరభద్రుడిగా భక్తులు కొలుస్తుంటారు.

జలవీరభద్రుడిని దర్శించడం వలన విజయం చేకూరుతుందనీ, అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ స్వామి అనుగ్రహం కారణంగానే పంటలు సమృద్ధిగా పండుతున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం భావిస్తుంటారు. ఆ స్వామి పట్ల తమకి గల కృతజ్ఞతను వివిధ రూపాల్లో చూపుతుంటారు.


More Bhakti News