పతియే ప్రత్యక్ష దైవం

సత్యవంతుడికి మనసిచ్చిన సావిత్రి ఆయనని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆయన అల్పాయుష్కుడని అదే సమయంలో తెలిసినా ఆమె తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోదు. తల్లిదండ్రులను ఒప్పించి సత్యవంతుడిని వివాహమాడుతుంది. అనునిత్యం సర్వమంగళ అయిన పార్వతీదేవిని పూజిస్తూ ఆమె అనుగ్రహాన్ని కోరుతూ వుంటుంది. పతియే ప్రత్యక్ష దైవంగా భావించి సేవలు చేస్తూ వుంటుంది.

అలా కొంతకాలం పాటు ఆ దంపతుల జీవితం ఆనందకరంగా సాగిపోతుంది. ఆ తరువాత సత్యవంతుడి ఆయువు తీరిపోయే సమయం దగ్గర పడుతూ వుంటుంది. దాంతో సావిత్రితో పాటు ఆమె తల్లిదండ్రులు ... సత్యవంతుడి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంటారు. సత్యవంతుడిని ఏ పనిచేయనీయకుండా ఇంటిదగ్గర ... తమ కళ్ల ముందల ఉండేట్టుగా చేస్తారు.

అలాంటి పరిస్థితుల్లోనే ఓ రోజున నారదమహర్షి సావిత్రి దగ్గరికి వస్తాడు. త్రిరాత్రి వ్రతం చేయడం వలన భర్త ప్రాణాలను కాపాడుకోవచ్చని చెబుతాడు. అందుకు సంబంధించిన విధి విధానాలను ఆమెకి వివరిస్తాడు. మహర్షి సూచన మేరకు ఆ వ్రతం చేయాలనుకున్న సావిత్రి భర్తతో పాటు అత్తామామల అనుమతిని తీసుకుంటుంది.

ఓ వైపున ఆమె ఆ వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ వుండగా, మరోవైపున సత్యవంతుడి ఆయువును తీసుకెళ్లేందుకు యమధర్మరాజు సిద్ధపడుతుంటాడు. అయితే సత్యవంతుడి ఆయుష్షును పూర్తి చేసే విషయంలో తాను ఓడిపోతానని ఆయనకి అనిపిస్తూ వుంటుంది. తనకి అలా అనిపించడానికి కారణం సావిత్రి పాతివ్రత్య మహిమ అని ఆయన తెలుసుకుంటాడు.


More Bhakti News