అనుగ్రహించే సుబ్రహ్మణ్యుడు

శివాలయాలలో ఆయన కుటుంబ సభ్యులుగా పార్వతీదేవి ... గణపతి ... కుమారస్వామి దర్శనమిస్తుంటారు. శివుడు సంపదలను ... అమ్మవారు సౌభాగ్యాన్ని ... వినాయకుడు విజయాన్ని ప్రసాదిస్తూ వుండగా, కుమారస్వామి సంతానాన్ని అనుగ్రహిస్తూ వుంటాడు. చాలా ప్రాంతాల్లో కుమారస్వామి శివాలయాల్లోనే దర్శనమిస్తూ వుంటాడు.

తమిళనాడు వంటి ప్రాంతాల్లో ఆయనకు భారీ స్థాయిలో ప్రత్యేక ఆలయాలు కొలువుదీరి కనిపిస్తుంటాయి. చాలా వరకూ అక్కడ వ్యక్తులకు ... దుకాణాలకు కూడా ఆయన పేరే ఉంటూ వుంటుంది. అంతగా ఆయన తన మహిమలచే భక్తులను ఆకట్టుకోవడం జరిగింది. కుమారస్వామి సర్పరూపంలో జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే ఆయన కొన్ని ఆలయాల్లో నెమలి వాహనంతోను ... మరికొన్ని ఆలయాల్లో సర్పాకారంలోను దర్శనమిస్తూ వుంటాడు. భక్తులు సంతానం కోసం నాగదేవతను ఆరాధించడంలోని ఆంతర్యం ఇదే. తారకాసుర సంహారం కోసం ఆయన అవతరించిన ఈ రోజునే 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున కుమారస్వామి ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటాయి.

అలా భక్తులతో పూజలందుకుంటోన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయం హైదరాబాద్ - వనస్థలిపురంలో కనిపిస్తుంది. వినాయకుడి ఆలయంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలో, శివపార్వతులతో పాటు కుమారస్వామి కూడా కొలువై కనిపిస్తాడు. నాగులచవితి ... నాగపంచమి ... సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. స్వామివారికి ఇష్టమైన పాయసం ... అరటి పండ్లను భక్తులు ఎక్కువగా సమర్పిస్తుంటారు ... ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News