శివకేశవ దర్శనం

ఆశ్వీయుజ మాసంలో శక్తి స్వరూపిణి అమ్మవారు వివిధ రూపాలతో ... నామాలతో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అలాగే కార్తీక మాసంలో శివుడు భక్తజనకోటిచే పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఇక మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువును అశేష సంఖ్యలో భక్తులు దర్శించుకుని తరిస్తుంటారు.

ఈ నేపథ్యంలో శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు ... శివకేశవులు కొలువుదీరిన క్షేత్రాలు విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి ప్రత్యేకతను సంతరించుకున్న క్షేత్రం, నల్గొండ జిల్లా కోదాడలో దర్శనమిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో హైవేకి దగ్గరలో ఈ ఆలయం కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం చాలాకాలంగా తన విశిష్టతను చాటుకుంటోంది.

పవిత్రతకు ... పరిశుభ్రతకు ప్రతీకగా కనిపించే ఈ ప్రాంగణంలో రామాలయం ... శివాలయం ... కనకదుర్గమ్మ ఆలయం కొలువుదీరి వుంటాయి. ఓ వైపున హనుమంతుడి మందిరం ... మరో వైపున గీతామందిరం కనిపిస్తుంటాయి. ఆలయాలకు మధ్య భాగంలో విశాలమైన వేదిక ఏర్పాటు చేయబడి వుంటుంది. అనునిత్యం ఈ ఆలయం భక్తులతో సందడిగా వుంటుంది. విశేషమైన పర్వదినాల సమయంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా వుంటుంది.

ఇక్కడి ఆలయ దర్శనం వలన ఆరోగ్యం ... విజయం ... సౌభాగ్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి ఏడాది సీతారాముల కల్యాణం ... శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం ఆలయం మధ్యభాగంలో గల వేదికపై నేత్రపర్వంగా జరుపుతుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ... అమ్మవారి ఆశీస్సులతో పాటు ... హరిహరుల అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News