చల్లగా చూసే అంకాళమ్మ

ప్రతి గ్రామాన్ని గ్రామదేవతలు పర్యవేక్షిస్తూ ... రక్షిస్తూ వుంటారు. గ్రామదేవతలు శక్తిస్వరూపిణి అయిన అమ్మవారి రూపాలుగా ఆరాధించబడుతుంటారు. ఆదిశంకరాచార్యులు ... రాఘవేంద్రస్వామి వంటి వారు ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి గ్రామదేవత అనుమతిని కోరుతూ ఆ గ్రామంలోకి అడుగుపెట్టే వాళ్లు ... ముందుగా ఆ తల్లి దర్శనం చేసుకునే వాళ్లు. దీనిని బట్టి గ్రామదేవతలకు గల ప్రాధాన్యతను ... ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

అలా అమ్మవారు ఆవిర్భవించిన క్షేత్రాలలో ఒకటిగా కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని 'మునకోళ్ల' గ్రామం కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో అమ్మవారు 'అంకాళమ్మ' గా భక్తులచే పూజలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారిని స్థానికులు ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తుంటారు. తమ కష్టనష్టాలను ఆ తల్లితోనే చెప్పుకుంటూ వుంటారు. ఎవరు ఏ శుభాకార్యాన్ని తలపెట్టినా ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఆమెకి తొలి ఆహ్వానాన్ని అందిస్తుంటారు.

మహిమల కారణంగానే అమ్మవారు భక్తులకు మరింత చేరువౌతూ వచ్చింది. అందుకు తగినట్టుగానే అంచలంచెలుగా ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. విద్య .. ఉద్యోగం .. వివాహం .. మొదలైన వాటి విషయంలో అంతా ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతుంటారు. ఆమె కరుణతోనే విజయాలు చేకూరతాయని వాళ్లు బలంగా విశ్వసిస్తుంటారు. పర్వదినాల్లో ఈ ఊరికి చెందిన ఆడపిల్లలు అత్తవారింటి నుంచి వస్తే తప్పని సరిగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుంటారు.

అంకిత భావంతో అమ్మవారిని సేవిస్తే సంపదలు ... సంతానం ... సౌభాగ్యం ప్రసాదిస్తుందని చెబుతుంటారు. ఆపదలను ... అనారోగ్యాలను తొలగించి ఆనందకరమైన జీవితాన్ని అందిస్తుందని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి వాతావరణం ఎప్పుడు చూసినా జాతరను తలపిస్తూ వుంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలవారు సైతం అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు ... ఆ తల్లి కృపాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.


More Bhakti News