కోరినవరాలనిచ్చే కొండ

దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ నిమిత్తం శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాలలో నరసింహ స్వామి అవతారానికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో విశిష్టత వుంది. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం రాతి స్థంభం నుంచి ఉద్భవించిన స్వామి, ఆయన కోరికమేరకు అనేక ప్రదేశాల్లో లక్ష్మీదేవి సమేతంగా ఆవిర్భవించాడు. ఆ ప్రదేశాలు నేడు మహిమాన్వితమైనటు వంటి దివ్య క్షేత్రాలుగా ... ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతున్నాయి.

అలాంటి వాటిలో విశిష్టమైనదిగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం విలసిల్లుతోంది. కోరిన వరాలను ప్రసాదించే కొండ కనుక దీనికి కోరుకొండ అనే పేరు వచ్చిందని అంటారు. ఎత్తైన కొండపై వెలసిన లక్ష్మీ నరసింహుడు ఎంతో దూరం నుంచే తన భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ వుంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ పుణ్య క్షేత్రం, ఇక్కడి ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ... ప్రధాన క్షేత్రాల్లో ఒకటిగా దర్శనమిస్తూ వుంటుంది.

ఇక్కడి లక్ష్మీనరసింహస్వామికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. కొండపై గల లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు కాగా, కొండ దిగువునగల లక్ష్మీనరసింహస్వామిని 'పరాశర మహర్షి' ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. కొండ దిగువునగల స్వామిని దర్శించుకుని, వందలాది మెట్ల మీదుగా కొండ పైభాగానికి చేరుకోవలసి వుంటుంది.

ఇక్కడి ప్రాకారాలపై ... స్తంభాలపై గల శిల్పాలు నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటాయి. గర్భాలయంలో అమ్మవారి సమేతంగా దర్శనమిచ్చే స్వామి ప్రతిమ పరిమాణం రీత్యా చిన్నగా కనిపించినా మహిమ మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఇక ఇదే ప్రాంగణంలో ఆళ్వారుల మందిరం కూడా దర్శనమిస్తుంది. ఎంతో మంది మహర్షులు ... మహారాజులు స్వామివారిని దర్శించిన ఆధారాలు వున్నాయి.

ఇక కోరుకొండ తీర్థం గురించి తెలియని వాళ్లంటూ వుండరు. అంతగా ఇక్కడి ఉత్సవాలు విశేషాన్ని ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. ప్రతియేటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఘనంగా నిర్వహించబడే ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక ఈ సందర్భంగా జరిగే రథోత్సవం చూసితీరవలసిందే ... అనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదించవలసిందే.


More Bhakti News