రాముడు కొలిచిన శివుడు

ప్రాచీనకాలానికి చెందిన శైవ క్షేత్రాలలో చాలా వరకూ రామాయణ కాలంతో ముడిపడి వుంటాయి. చాలా శైవ క్షేత్రాల్లో దర్శనమిచ్చే శివుడిని శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినట్టు చెప్పబడుతోంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్లినప్పుడు, ఆమెను అన్వేషిస్తూ రామలక్ష్మణులు బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో ఈ అన్వేషణ ఫలించాలనే ఉద్దేశంతో శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్ఠ చేస్తూ వెళ్లాడు.

అదే విధంగా సీతాదేవిని తీసుకుని వస్తూ, రావణాసురుడిని వధించిన పాపాన్ని ప్రక్షాళన గావించేందుకు అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. మహబూబ్ నగర్ జిల్లా రాయికల్ గ్రామంలో అలరారుతోన్న శైవ క్షేత్రం కూడా ఈ నేపథ్యంలో ఆవిర్భవించినదే. ఈ కారణంగానే ఇక్కడి శివుడిని 'రామేశ్వరుడు'గా పిలుస్తుంటారు.

అయితే కాలక్రమంలో ఈ శివలింగం భూగర్భంలో ఉండిపోయింది. ఓ సాధువు ఈ ప్రాంతంలో ధ్యానం చేసుకుంటూ వుండగా, శ్రీరాముడు దర్శనమిచ్చి ఆ శివలింగం జాడను తెలియజేశాడట. శ్రీరాముడి ఆదేశం మేరకు ఆ సాధువు శివలింగం బయటికి కనిపించేలా ఏర్పాట్లు చేసి పూజించాడు. ఆయన ద్వారా ఆ శివలింగం విశిష్టతను తెలుసుకున్న ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు.

నాటి నుంచి స్వామివారికి నిత్య ధూప .. దీప .. నైవేద్యాలు జరుగుతున్నాయి. ఎంతోమంది మహనీయులు ఈ స్వామివారిని దర్శించి ధన్యులయ్యారు. మరెందరో భక్తులు ఇక్కడి శివయ్యను సేవించి కార్యసిద్ధిని పొందారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తులు చెబుతుంటారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ జరిగే ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.


More Bhakti News