తిరుమలయ్య గుట్ట

ఆపద కలిగిన వెంటనే దాని నుంచి గట్టెక్కించమని అంతా ఆ వేంకటేశ్వరస్వామిని వేడుకుంటూ వుంటారు. ఆపద తొలగిపోతే మొక్కుబడులు చెల్లిస్తామంటూ మొక్కుకుంటూ వుంటారు. కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామికి ఆపద మొక్కులవాడిగా వున్న పేరు అంతా ఇంతా కాదు. ఈ కారణంగానే ఆయన ఆలయాలు ఎక్కడ వున్నా ఎప్పుడూ భక్తుల సందడితో అలరారుతుంటూ వుంటాయి.

అలాంటి వేంకటేశ్వరస్వామి క్షేత్రం మనకి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని 'పెద్దగూడెం'లో దర్శనమిస్తోంది. ఇక్కడ స్వామి ఆవిర్భవించిన గుట్టను 'తిరుమలయ్య గుట్ట'గా పిలుస్తుంటారు. అలమేలుమంగా సమేతంగా దర్శనమిస్తోన్న ఇక్కడి స్వామిని భక్తులు తిరుమలనాథస్వామిగా భావించి సేవిస్తుంటారు. ఓ భక్తుడి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థలచరిత్ర చెబుతోంది.

చాలా పెద్ద గుట్టపై విశాలమైన ప్రదేశంలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది. కొండ పైభాగం నుంచి తిలకిస్తే ప్రకృతి ఒడిలో ఈ కోనేటిరాయుడు కొలువుదీరి ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. స్వామివారి అనుగ్రహంతో ఆయా వ్యాధుల బారి నుంచి ... బాధల బారి నుంచి బయటపడిన వాళ్లు మొక్కుబడులు చెల్లించడానికి వస్తూ వుంటారు.

ఇక స్వామివారిది శ్రవణా నక్షత్రం కనుక, శ్రావణ మాసంలో జాతరను నిర్వహిస్తూ వుంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర మహోత్సవంలో పరిసర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు పాల్గొంటూ వుంటారు. అత్తవారింటికి వెళ్లిన ఈ ఊరు ఆడపిల్లలు తమ దేవుడి జాతరను వీక్షించేందుకు పుట్టింటికి చేరుకుంటారు. ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలలో వున్న వాళ్లు సైతం జాతర సమయానికి ఇక్కడికి చేరుకుంటారు ... స్వామివారి వేడుకను కనులారా తిలకిస్తూ పరవశించిపోతుంటారు.


More Bhakti News